కరోనా కలకలం.. ఒకే స్కూల్‌లో 229మంది విద్యార్థులకు పాజిటివ్

కరోనా కలకలం.. ఒకే స్కూల్‌లో 229మంది విద్యార్థులకు పాజిటివ్

229 school students test corona positive: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ కి చెందిన 229 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

వాషిమ్ జిల్లా రిసోడ్‌ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్‌ స్కూల్ లో ఇది జరిగింది. బుధవారం(ఫిబ్రవరి 24,2021) జిల్లా కలెక్టర్‌ శణ్ముగరాజన్‌ పాఠశాలను సందర్శించారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను సీల్‌ చేసి, కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులంతా స్కూల్ కి సంబంధించిన హాస్టల్‌లో ఉంటున్నారు. మూడంతస్తుల ఈ హాస్టల్ లో అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిమ్, బుల్దనా, అకోలా జిల్లాల విద్యార్థులు ఉంటున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటుండగా ఇలా విద్యార్థులు కరోనా బారిన పడటం భయాందోళనలకు గురి చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు.

Coronavirus stay long time on Smartphone Screens

327మందిలో 229మందికి కరోనా:
పాఠశాలలో మొత్తం 327 మంది విద్యార్థులుండగా.. 229మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువమంది 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలే. లాక్ డౌన్ సడలింపులతో ఇటీవలే పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 14న విద్యార్థులంతా స్కూల్ కి రావడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే విద్యార్థులంతా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. 229 మందికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా సోకినా విద్యార్థులను వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు:
కాగా, మహారాష్ట్రలో బుధవారం 8వేల 807 మందికి కరోనా సోకగా, 80 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా రోగుల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్రంలో మంగళవారం కరోనా రోగుల సంఖ్య 6వేల 218 నమోదు కాగా బుధవారం ఏకంగా 8,807 నమోదైంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,95,578 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

అలసత్వం వద్దు:
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్‌ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది. కరోనా నివారణలో భాగంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ముగ్గురు చొప్పున సభ్యులుండే బృందాలను రంగంలోకి దించింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నేతృత్వం వహిస్తున్నారు.