భారీగా తగ్గిన వంటగ్యాస్ సిలిండర్.. కొత్త ధరలు ఇవే

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 01:35 AM IST
భారీగా తగ్గిన వంటగ్యాస్ సిలిండర్.. కొత్త ధరలు ఇవే

దేశంలో వంటగ్యాస్‌ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బెంచ్‌మార్క్‌ రేట్ల తగ్గుదలతో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ (14.2 కిలోల) ధరను రూ. 162.50 వరకు తగ్గించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల LPG సిలిండర్‌ ధరను రూ.1,285 నుంచి రూ.1,029.50కు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు వెల్లడించాయి. సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌ ధరలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్‌డౌన్స్ విధించడంతో ముడిచమురుకు డిమాండ్‌ తగ్గింది. అంతర్జాతీయంగా ధరలు పతనం కావడం కూడా దీనికి కారణం. ఢిల్లీలో గురువారం వరకు రూ.744గా ఉన్న 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర.. తగ్గింపుతో రూ.581.50లకు చేరింది. హైదరాబాద్‌లో ఏకంగా రూ.207 తగ్గి రూ. 589.50కు చేరింది. ఇటీవలి కాలంలో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి కావడంవ విశేషం. 

గతేడాది జనవరిలో ధర రూ.150.50 వరకు తగ్గింది. సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌ ధరను 2020 మార్చిలో రూ.53 వరకు తగ్గించగా, ఏప్రిల్‌లో రూ.61.50 చొప్పున తగ్గించాయి చమురు మార్కెటింగ్‌ సంస్థలు. తాజాగా మరో రూ.162.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సగటు ధరతోపాటు విదేశీ మారక రేటును ఆధారంగా  చమురు సంస్థలు ప్రతినెలా ఒకటో తేదీన వంటగ్యాస్‌ ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే.