పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో వాలంటీర్ మృతి, రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 09:59 AM IST
పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో వాలంటీర్ మృతి, రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గబ్బాడ అనురాధ(26) పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఆ సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయింది. వాలంటీర్ చనిపోయిన వార్త తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే  స్పందించారు. వాలంటీర్ అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

సీఎంవో అధికారులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం జగన్ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వంటి విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. అనురాధ కుటుంబానికి సాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ సాయంగా రూ.10వేలు వాలంటీర్ కుటుంబానికి అందజేశారు.