Pushpa: The Rise: పుష్ప: ది రైజ్.. రివ్యూ

దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ మూవీ.. తనకున్న స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ ను పక్కన పెట్టేసి పక్కా ఊరమాస్ పాత్రలో ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ నటించిన సినిమా..

Pushpa: The Rise: పుష్ప: ది రైజ్.. రివ్యూ

Pushpa Bunny

చిత్రం: పుష్ప-పార్ట్ 1

దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ మూవీ.. తనకున్న స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ ను పక్కన పెట్టేసి పక్కా ఊరమాస్ పాత్రలో ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ నటించిన సినిమా.. పైగా బన్నీ కెరీర్లోనే తొలిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ముందు ఒక సినిమాగా మొదలై ఒకటి కాదు ఇది రెండు పార్టులుగా రాబోతుందని ఊరించిన సినిమా పుష్ప. మారేడుమిల్లి అడవులలో భారీ క్యాస్టింగ్, అంతకు మించిన శేషాచలం అడవుల సెట్టింగ్.. జోరు వానలు, కరోనా కష్టాలు అన్నిటినీ ఎదుర్కొని తెరకెక్కించిన సినిమా పుష్ప. ఇదీ అదీ అని కాకుండా విడుదలకు ముందు ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ ఈ సినిమా మీద ఎన్నడూ లేని అంచనాలను పెంచేశాయి. అభిమానులు ఎన్ని అంచనాలనైనా పెట్టుకొని సినిమాకు రండి.. ఆ అంచనాలను ఒక్క ఇంచు కూడా సినిమా ఎక్కడా తగ్గదని మేకర్స్ ఇంకా ఇంకా హైప్ పెంచేశారు. మరి ఇన్ని అంచనాల నడుమ వచ్చిన పుష్ప సినిమా ఎలా ఉందో చూద్దమా..

నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్‌, అజయ్‌, అజయ్‌ ఘోష్‌
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెక్‌
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాసన్‌
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌
రచన, దర్శకత్వం: సుకుమార్‌

కథ:

పుష్ప అలియాస్ పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్) చిత్తూరు జిల్లాలో ఒక పేద కుటుంబానికి చెందిన ఓ కూలీ కుర్రాడు. తన తల్లిని తండ్రి అధికారికంగా పెళ్లి చేసుకోకపోగా, తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తనకంటూ ఒక ఇంటి పేరు లేక.. ఆదరువు లేక అవమానాల పాలవుతుంటాడు. అయితే, ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం. కానీ, అయిన‌వాళ్లు త‌న ఇంటి పేరు కూడా లాక్కోవ‌డంతో క‌సితో పెరుగుతాడు. డబ్బు సంపాదిస్తేనే సమాజంలో తనకొక గుర్తింపు వస్తుందని అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడి ఎర్రచందనం నరికే ముఠాలో కూలీగా మారతాడు. అక్కడే కేశ‌వ అనే స్నేహితుడు క‌లిశాక పుష్ప ప్ర‌యాణ‌మే మారిపోతుంది. కూలీ నుంచి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌రైన పుష్ప.. ఆ తర్వాత కొండా రెడ్డి (అజ‌య్ ఘోష్‌) అత‌ని సోద‌రుల‌కి స్మగ్లింగ్‌లో ఉపాయాలు చెప్పే స్థాయికి ఎదుగుతాడు. ఆ త‌ర్వాత ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లర్‌ల సిండికేట్‌లో ఓ భాగ‌స్వామిగా, త‌ర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు. పుష్ప ఒక్కో మెట్టు ఎక్కేకొద్దీ అతడికి శత్రువులు కూడా పెరుగుతారు. అప్పటివరకు ఆ స్థాయిలో ఉన్న మంగ‌ళం శ్రీను (సునీల్‌)కి కంట‌గింపుగా మారుతుంది. అపాయ‌క‌ర‌మైన మంగ‌ళం శ్రీను, కొండా రెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో శ‌త్రుత్వం పెంచుకున్న పుష్ప‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శ్రీవ‌ల్లి (ర‌ష్మిక‌)ని ప్రేమించిన పుష్ప ఆమెని పెళ్లాడాడా లేదా?కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్ప‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయ‌న్న‌ది తెలియాలంటే ‘పుష్ప: ది రైజ్‌’ చూడాల్సిందే.

కథనం:
శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీల సీన్ తో సినిమా మొదలవుతుంది. హీరో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో పరిచయమవగా.. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసుల అతనిని అరెస్ట్ చేసి చితకబాది స్మగ్లింగ్ గురించి ఆరా తీస్తారు. అలా అతను.. తనతో స్మగ్లింగ్ చేయించింది తన బాస్ పుష్ప రాజ్ అంటూ అతని కథ చెప్పడం మొదలు పెడతాడు. కథ ఓ భారీ ట్విస్ట్ తో ముగుస్తుంది. కథ పూర్తిగా రీవిల్ అయిన అనంతరం.. పుష్ప రాజ్ అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ప్రియురాలు శ్రీవల్లి(రష్మీక మందన్నా) తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూనే స్మగ్లింగ్ గ్యాంగ్ కి పుష్ప ఎలా నాయకత్వం వహిస్తాడనే దాని చుట్టే కథ మెత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డిని (అజయ్‌ ఘోష్), అతని తమ్ముళ్ళను పుష్ప ఎలా ఎదుర్కున్నాడు..? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్) తో మంచిగా ఉంటూనే అతనికే ఎలా ఏసరు పెట్టాడు.. చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన పుష్ప రాజ్.. తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ:
పుష్ప ది రైజ్ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి… అల్లు అర్జున్ నటన గురించి. రెండు… దర్శకుడు సుకుమార్ క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు .. ఆ క్యారెక్టర్లను కలిపిన విధానం గురించి. ఒక్క అల్లు అర్జున్ క్యారెక్టరే కాదు, సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను సుకుమార్ బాగా డిజైన్ చేశారు. ఉదాహరణకు అజయ్ క్యారెక్టర్ తీసుకుంటే, ముందు నుంచి అతడు ఒకటే స్టాండ్ మీద ఉంటాడు. తన తండ్రి ఉంచుకున్న ఆవిడకు పుట్టినవాడు తన తమ్ముడు కాదని, తమ ఇంటిపేరు వాళ్లు వాడుకోవడానికి వీల్లేదని. అలాగే ధనుంజయ క్యారెక్టర్… నచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం చేసే కామాంధుడిగా చూపించారు. సునీల్, అనసూయ తరహా జోడీను గతంలో చూసినట్టు ఉంటుంది కానీ ఈ క్యారెక్టర్లను సుకుమార్ ఓ చోటుకు చేర్చిన తీరు, కథలో సందర్భానుసారం ఉపయోగించుకున్న విధానం బావుంటుంది. ఇంటిపేరు వల్ల హీరోకు ఎక్కడెక్కడ ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయి.. అవమానం నుంచి అతడు ఎలా మారాడు.. అనేది సుకుమార్ ఆసక్తిగా చూపించారు. కానీ.. కథలో ఊహాతీత మలుపులు అనుకున్న స్థాయిలో లేకపోవడం.. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా సినిమా సాగుతుండడం.. సినిమాకు మైనస్. అయితే హీరోయిజాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ధీమాగా చెప్పొచ్చు. సినిమాలో ఉన్న విలన్లు హీరోను ఛాలెంజ్ చేసే స్థాయిలో ఢీ కొట్టే విధంగా పాత్రలు ఇంకాస్త మెరుగ్గా రాసుకొని ఉంటే సినిమా మరో క్లాసిక్ అయ్యేదేమో అనిపిస్తుంది.

నటీనటులు:
నిస్సందేహంగా ‘పుష్ప’ సినిమా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. కెరీర్లో ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చాడతను. పుష్ప పాత్రను అతను తప్ప ఇంకెవరూ ఇంత బాగా చేయలేరేమో అనిపించేలా ఆ పాత్రకు ప్రాణం పోశాడు. క్యారెక్టర్ కోసం అవతారం మార్చుకుని.. సరికొత్త బాడీ లాంగ్వేజ్ చూపించడమే కాదు.. చిత్తూరు యాసలో అథెంటిగ్గా డైలాగులు చెప్పడం ద్వారా బన్నీ తన కమిట్మెంట్ చూపించాడు. బన్నీ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ కొన్ని రోజుల పాటు ప్రేక్షకులను వెంటాడుతుందనడంలో సందేహం లేదు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా బాగానే కష్టపడింది. ఓవరాల్ గా రష్మిక అప్పీయరెన్స్.. పెర్ఫామెన్స్ ఓకే అనిపిస్తుంది. విలన్ పాత్రధారులందరిలోకి కొండారెడ్డిగా అజయ్ ఘోష్ నటన ఆకట్టుకుంటే.. మంగళం శీనుగా సునీల్ లుక్ భిన్నంగా కనిపిస్తుంది. అనసూయ పాత్ర కూడా ఒకే అనిపిస్తుంది. జాలి రెడ్డిగా ధనంజయ బాగా చేస్తే.. హీరో స్నేహితుడిగా చేసిన ‘పలాస’ ఫేమ్ జగదీష్ చాలా బాగా చేశాడు. హీరో తర్వాత బెస్ట్ పెర్ఫామెన్స్ అంటే జగదీష్ దే. ఫాహద్ ఫాజిల్ కనిపించిన కాసేపట్లోనే తన ప్రత్యేకతను చాటుకుని.. సెకండ్ పార్ట్ మీద ఆసక్తి రేకెత్తించేది అతనే. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:
దర్శకుడు సుకుమార్ తాను అనుకున్న కథ పాయింట్‌‌ను ఒక్కొక్క పొరగా అల్లిన తీరు చాలా బాగుంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం అద్బుతంగా ఉంది. పిరియాడిక్ మూవీకి కావాల్సిన క్యాస్టూమ్ డిజైనింగ్ సినిమాకు ఓ రకమైన శోభను తీసుకొచ్చింది. పాత్రల హావభావాలు, ఎమోషనల్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు మేలవించి తెర మీద చూపించిన పద్ధతి చాలా బాగుంది. తెలుగు తెర మీద ఓ కొత్త అనుభూతిని కలిగించే విధంగా కథ, కథనాలు రూపొందించుకోవడం సినిమాకు అత్యంత బలం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో ‘ఊ అంటావా… ఊఊ అంటావా’, ‘చూపే బంగారం…’ పాటలు కొన్నాళ్లు వినపడతాయి. ‘ఏయ్ బిడ్డా… ఇది నా అడ్డా’ సాంగ్ కూడా బావుంటుంది. అయితే.. నేపథ్య సంగీతం విషయంలో దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఏదైనా చేయాలేమో అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ సినిమాకి ప్లస్ పాయింట్ కాగా.. వాటితో పాటు హీరోయిజం మరింత ఎలివేట్ చేసే సంగీతం కావాలేమో అనిపిస్తుంది. సినిమా నిడివి కాస్త ఎక్కువే అనిపించినా.. ఆ మాత్రం స్పష్టత లేకపోతే సినిమా సగటు ప్రేక్షకులను అర్ధం కాకపోవచ్చేమో అనిపిస్తుంది. ఇక, సినిమాటోగ్రఫీ సూపర్. ప్రొడక్షన్ వేల్యూస్ టాప్ క్లాస్. స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ఒకే అనిపిస్తుంది. ఫస్టాఫ్ చూశాక.. సెకండాఫ్‌లో హీరోయిజం గురించి అంతకు మించి అంచనా వేస్తారు ప్రేక్షకులు. కానీ.. ఫస్ట్ హాఫ్ స్థాయిలోనే సెకండాఫ్ సాగుతూ కాస్త నిరాశగా అనిపిస్తుంది. కానీ, ఆ లోపాలను అల్లు అర్జున్ తన నటనతో కవర్ చేసేస్తాడు.