Bandi Sanjay Open Letter : టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర ఉంది. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసింది.(Bandi Sanjay Open Letter)

Bandi Sanjay Open Letter : టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay Open Letter

Updated On : April 9, 2022 / 6:50 PM IST

Bandi Sanjay Open Letter : తెలంగాణలో ధాన్యం దంగల్ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా యుద్ధమే ప్రకటించారు. తెలంగాణలో పండించిన ధాన్యం కొనకపోతే సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ నేతలు కూడా తగ్గేదేలే అన్నట్టు ఎదురుదాడికి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారు.

MLA Jeevan Reddy : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ ఆయనీ లేఖాస్త్రం సంధించారు. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర ఉందని లేఖలో ఆరోపించారు బండి సంజయ్. బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కు అయ్యారని ఆయన ఆరోపణలు గుప్పించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందన్నారు. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్ చేశారని అన్నారు. రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమే అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుట్రతో రైతన్నలు పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.(Bandi Sanjay Open Letter)

Kalvakuntla kavitha : పంటల సేకరణపై FCI వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలి

”అన్నదాతలారా.. కేసీఆర్ కుట్రలను ఛేదిధ్దాం రండి.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి.. రైతు పండించే ప్రతి గింజ కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.. వడ్ల కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేళ్లలో ఇప్పటికే తెలంగాణకు రూ.97వేల కోట్లను చెల్లించింది. వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదు. వడ్లను సేకరించి కేంద్రానికి అప్పగించకుండా టీఆర్ఎస్ సర్కార్ డ్రామాలాడుతోంది. యాసంగి ధాన్యం సేకరణ వివరాలు కూడా కేంద్రానికి కేసీఆర్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 25 నాటి సమావేశ మినిట్స్ ను పంపించేందుకు సిద్ధం. కొనుగోలు కేంద్రాలను ఎందుకు మూసేశారో సీఎం జవాబు చెప్పాల్సిందే” అని లేఖలో డిమాండ్ చేశారు బండి సంజయ్.

తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండటంతో పాటు ఢిల్లీలోనూ కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనేవరకు ఆందోళనలు చేస్తామంటూ, కేంద్రంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనంటూ టీఆర్ఎస్ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

బ్యాంకులను మోసం చేసిన వారిని దేశం బయటికి పంపిన చరిత్ర బీజేపీ నేతలదని టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. నలుగురు ఎంపీలు తలో మాట మాట్లాడతారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీలు అని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలుకు ముందుకు వస్తే మంచిదన్నారు.