Thief Doctor: శిశువును దొంగిలించి రూ.15లక్షలకు అమ్మేసిన డాక్టరమ్మ

Thief Doctor: శిశువును దొంగిలించి రూ.15లక్షలకు అమ్మేసిన డాక్టరమ్మ

Bangalore Women Psychiatrist Arrested

Bangalore women psychiatrist arrested : డాక్టర్ అంటే రోగుల పాలిట దేవుడుగా భావిస్తాం. డాక్టర్లపై నమ్మకంతో మన ప్రాణాల్నే కాదు మన బిడ్డల్ని కూడా వాళ్లు చేతుల్లో పెడతాం. కనిపించే దేవుడిగా డాక్టర్లను కొలుస్తాం.కానీ ఓ డాక్టరమ్మ మాత్రం తల్లి ఒడిలో వెచ్చగా పడుకున్న బిడ్డను దొంగిలించింది. అంటే బిడ్డమీద ఉన్న ప్రేమతో కాదు..ఆ బిడ్డను అమ్మేయటానికి. అలా నవజాత శివువు కిడ్నాప్ కేసులో డాక్టరమ్మ ముద్దాయిగా నిరూపించబడటంతో పోలీసులే షాక్ అయిన ఘటన బెంగళూరులో జరిగింది. శిశువు కిడ్నాప్ స్టోరీ కాస్తా సినిమా స్టైల్లో సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది. ఈ కేసుని ఛేదించటానికి పోలీసులు పదీ ఇరవై కాదు వందా రెండు వందలు కూడా కాదు ఏకంగా 30,000 ఫోన్ కాల్స్ ను పరిశీలించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం క్రితం జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ఎట్టకేలకూ నిందితురాలిని పట్టుకోగలిగారు బెంగళూరు పోలీసులు.

బెంగళూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో సైకియాట్రిస్ట్‌గా పనిచేసే డాక్టర్ రష్మి శశికుమార్. వయస్సు 34 ఏళ్లు. ఆమె ఓ నవజాత శిశువును దొంగిలించిందనే ఆరోపణలతో గత ఆదివారం (మే30,2021)న పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని చమరాజ్‌పేటలో ఉన్న BBMP మెటర్నటీ హాస్పిటల్ నుంచి ఓ బిడ్డను దొంగిలించి అమ్ముకుందనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యింది డాక్టర్ రష్మి.

బెంగళూరు సౌత్‌ డీసీపీ హరీష్ పాండే తెలిపిన వివరాల ప్రకారం..34 ఏళ్ల డాక్టర్ రష్మి బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది. ఆమెకు అనుపమ అనే మహిళ పరిచయం అయ్యింది. అనుపమకు మానసిక వైకల్యం కలిగిన ఓ పాప ఉంది. ఆ పాప చికిత్స కోసం డాక్టర్ రష్మి దగ్గరకు అనుపమ వచ్చింది. అలా వారి పరిచయం పెరిగింది. అనుపమకు ఉన్న ఒక్క పాప మానసిక వైకల్యం ఉండటంతో మరో బిడ్డ కావాలనుకున్నారు అనుపమ దంపతులు. దాని కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. అదే విషయాన్ని వారికున్న పరిచయంతో రష్మికి చెప్పింది అనుపమ.

అనుపమ చెప్పిన మాటలు విన్న రష్మికి ఓ ఆలోచన వచ్చింది. అప్పటికే డాక్టర్ రష్మి భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.దానికి తోడు రష్మి చదువు కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోను బాకీలు కూడా కట్టలేకపోవటంతో వడ్డీ పెరిగిపోతోంది. లోన్ బకాయిలు. వడ్డీలు ఇలా ఆర్థికంగా సతమతమైపోతోంది డాక్టర్ రష్మి కుటుంబం అప్పటికే. ఈక్రమంలో అనుపమ సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకున్న విషయం చెప్పేసరికి వారి అవసరాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకోవాలనుకుంది డాక్టర్ రష్మి. దీంతో అనుపమ దంపతులకు సరోగేట్ మదర్‌ను ఏర్పాటు చేయించి..వారి నుంచి డబ్బు డిమాండ్ చేయాలనుకుంది. కానీ రష్మి వేసిన ప్లాన్ ప్రకారం..అనుకున్న సమయానికి సరోగేట్ మదర్ దొరకలేదు. కానీ రోగసీ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసానని..చేయాల్సింది చేయాలని అన్ని చేయించింది. ఆ తరువాత సరోగసీ ప్రక్రియ అంతా సక్రమంగా జరుగుతోందని..2020 మే 28 లోపు సరోగేట్ మదర్ కు ప్రసవం అయ్యే అవకాశం ఉందని నమ్మించింది అనుపమ దంపతుల్ని.

కానీ 28 తేదీ దగ్గర పడుతోంది. పసిబిడ్డను ఎక్కడ నుంచి తీసుకొచ్చి వీరికి ఇవ్వాలని ఆలోచించింది డాక్టర్ రష్మి. దాని కోసం రష్మీ కొత్త ప్లాన్ వేసింది. హాస్పిటల్సో అప్పుడే ప్రసవమైన తల్లుల నుంచి బిడ్డలను దొంగిలించి, అనుపమ దంపతులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా..బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లి ఎవరెవరు ప్రసవించారు? అని ఆరాతీసింది. అలా బీబీఎంపీ హాస్పిటల్‌కు వెళ్లింది. కన్సల్టింగ్ డాక్టర్‌ ని అని అక్కడి వాళ్లను నమ్మించింది. ఇదే సమయంలో హుస్నా భాను అనే మహిళ ప్రసవించినట్లుగా తెలుసుకుంది. ఆమె బిడ్డను ఎత్తుకెళ్లిపోవాలని అనుకుంది. ఎవరూ లేని సమయంలో తల్లికి మత్తుమందు ఇచ్చి..ఆమెకు పుట్టిన మగపిల్లాడిని తీసుకెళ్లిపోయింది. ఈ బాబే సరోగసి ద్వారా మీకు పుట్టిన బాబు అని చెప్పి.. అనుపమ దంపతులను నమ్మించింది. తల్లి ఎలా ఉందని అనుపమ అడిగింది. దానికి డాక్టర్ రష్మి ఏమాత్రం తడుముకోకుండా ప్రసవ సమయంలో కొన్ని సమస్యలతో తల్లి మరణించిందని చెప్పింది. దానికి అనుపమ అయ్యో పాపం అని బాధపడింది.

BBMP మెటర్నటీ హాస్పిటల్ లో బాబును కన్న హుస్నా బాను తన పొత్తిళ్లలో పడుకున్న బిడ్డ కనిపించకపోయేసరికి తల్లడిల్లిపోయింది. హుస్నా భాను భర్త నవీద్ పాషా దంపతులు బిడ్డ కోసం ఆస్పిటల్ సిబ్బందిని అడిగినా ఫలితం లేకపోయింది. బాబు కోసం వెతికారు అని ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు వలస వచ్చిన హుస్నా భాను, నవీద్ పాషా దంపతులకు పుట్టిన బిడ్డ బీబీఎంపీ ఆసుపత్రిలో శిశువు కనిపించకుండా పోయిన వార్త 2020లో సంచలనంగా మారింది. బిడ్డ కోసం వెతికి వెతికి వేశారి పోయిన హుస్నా భాను దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఎటువంటి ఆదారాలు దొరకలేదు.

హాస్పిటల్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లో.. నిందితురాలు బాబును తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యియి. కానీ వీడియోలో సరిగా కనిపించకపోవటంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. చాలా రకాలుగా విచారణ చేసినా ఫలితం దక్కలేదు. ఈ కేసును పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా 20 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించడం దగ్గరి నుంచి దగ్గర్లో ఉన్న టవర్ల పరిధిలో రికార్డ్ అయిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించడం వరకు శత విధాలుగా ప్రయత్నించారు. అలా 35,000 ఫోన్ నంబర్లను పోలీసుల టీమ్ విశ్లేషించింది.

వాటిని ఫిల్టర్ చేసి ఆఖరికి 600 ఫోన్ నంబర్లను అనుమానితుల లిస్ట్ తయారు చేశారు.వీళ్ల ఫోటోలతో బిడ్డ మిస్ అయిన సమయంలో వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలను సేకరించారు. అలా ఎన్నో విధాలుగా ట్రై చేసి చేసి..లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించారు. అలా పోలీసుల దర్యాప్తు సంవత్సరం పాటు సాగింది. ఆఖరికి ఎట్టకేలకు రష్మి ఫోటోతో అనుమానితుల స్కెచ్‌ను పోల్చి చూసి.. ఆమే ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని నిర్ధారించారు. అలా ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బైటపడింది. రష్మీ అనుపమ దంపతులకు దొంగిలించి తీసుకొచ్చిన బిడ్డను అమ్మినట్లుగా తేలింది. దాని కోసం వారినుంచి రూ.15లక్షలు తీసుకున్నట్లుగా వెల్లడైంది.

మొత్తానికి సంవత్సరం క్రితం తల్లి నుంచి వేరు చేసిన బాబును పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాలేవీ కూడా బాబును పెంచుకుంటున్న అనుపమ దంపతులకు తెలియదని పోలీసులు తెలిపారు. బాబు DNA విశ్లేషణ పూర్తయిన తరువాత, తనను అసలు తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు బెంగళూరు సౌత్‌ డీసీపీ హరీష్ పాండే