Bandi Sanjay : బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ..!

బండి సంజయ్‌‌ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బీజేపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

Bandi Sanjay : బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ..!

Bandi Sanjay

Bandi Sanjay Arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్‌కు పంపిన తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. జీవో317కు నిరసనగా సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షభగ్నంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బండి సంజయ్‌‌ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జన జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌కు రానున్న జేపీ నడ్డా :
బండి సంజయ్ సహా పలువురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ ను అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ ఈ రోజు సాయంత్రం క్యాండీ ర్యాలీని బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. బండి సంజయ్ అరెస్టు, తదనంతర పరిణామాలను కమలనాథులు ఆయనకు వివరించనున్నారు. అనంతరం బీజేపీ శ్రేణులు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి లిబర్టీలోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో బీజేపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతినిస్తారా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. జైల్లో ఉన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో ములాఖత్ కానున్నట్టు తెలుస్తోంది.

ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. బండి సంజయ్‌ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఈనెల 17 వరకు బండి సంజయ్‌తో పాటు కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచరవి, మర్రి సతీశ్‌లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ ఆదివారంరాత్రి కరీంనగర్ లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కోవిడ్ నిబంధనలు అమలవుతున్న కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

నోటీసు జారీ చేసినా వినలేదు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత దాదాపు మూడు గంటల హై డ్రామా మధ్య బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు.

Read Also : BJP MP Bandi Sanjay : బండి సంజయ్‌ బెయిల్ పిటీషన్ కొట్టివేత-14 రోజుల రిమాండ్