Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నాయని..తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన కొడుకు

Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నాయని..తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన కొడుకు

Black Fungus (1)

Black fungus : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసిన ఓ కొడుకు తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న తండ్రి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసి కొడుకు తండ్రిని పట్టించుకోకుండా వదిలేసి పోయిన ఘటన పలువురిని కంటతడిపెట్టిస్తోంది. బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. కానీ తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించటంతో ఇక తండ్రికి వైద్యం చేయించటం నా వల్లకాదంటూ తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేశాడు.

వికారాబాద్ జిల్లాలోని రుకుంపల్లికి చెందిన 63 సంవత్సరాల చంద్రయ్యకు మే 3 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో చంద్రయ్య కొడుకు తాండూరు జిల్లా ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం కరోనానుంచి చంద్రయ్య కోలుకున్నాడు. కొడుకు ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ ఆ తరువాత కొన్ని రోజులకు చంద్రయ్యకు కన్ను,నుదరు మీద బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. దీంతో చంద్రయ్య కొడుకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. తనకు కొడుకు చికిత్స చేయించటానికి తీసుకొచ్చాడని చంద్రయ్య అనుకున్నాడు. అలా తండ్రిని ఓ చోట కూర్చోమని..ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు కొడుకు. కానీ కొడుకు ఇంకా రాకపోవటంతో చంద్రయ్య కొడుకు కోసమే ఎదురు చూస్తూ అక్కడే కూర్చుని పడిగాపులు కాస్తున్నాడు.

చంద్రయ్య అక్కడే కూర్చుని ఉండటం చూసిన వైద్య సిబ్బంది విషయం తెలుసుకున్నారు. వెంటనే చంద్రయ్య కొడుకుకి ఫోన్ చేయగా..మేం ఇక అతడిని చూసుకోలేం..మీరే ఏదోకటి చేయండి అని ఫోన్ పెట్టేశారు. దీంతో వైద్య సిబ్బంది చంద్రయ్యను చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించటానికి అంబులెన్స్ ను సిద్ధం చేశామని తెలిపారు.