జోరుగా కారు ప్రచారం.. రంగంలోకి కేటీఆర్, హరీష్ రావు

జోరుగా కారు ప్రచారం.. రంగంలోకి కేటీఆర్, హరీష్ రావు

సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటుతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ పరిధిలోని పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపుకోసం నేతలంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్‌తో మంత్రులు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించాలని టీఆర్ఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు ఖాయమని చెప్పిన మంత్రి హరీశ్‌రావు.. రంగారెడ్జి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర పార్టీల నేతలు మాటలకే పరిమితం అయ్యారని, కానీ టీఆర్ఎస్ మాత్రం చేసి చూపించిందని అన్నారు. త్వరలో ఇబ్రహీంపట్నంలో కూడా తాగునీటి సరఫరా ప్రారంభిస్తామని అన్నారు. ఏకైక మహిళా అభ్యర్థి వాణిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని హరీష్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. హన్మకొండలో నిర్వహించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ సమావేశంలో.. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్స్‌ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో 50వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి హామీనిచ్చారు.