Dry Swab Test : గుడ్ న్యూస్.. కేవలం రూ.60కే కరోనా టెస్ట్.. 3 గంటల్లోనే రిజల్ట్

డ్రైస్వాబ్‌ (పొడి పరీక్ష).. కరోనా నిర్ధారణ పరీక్షను మరింత చౌకగా, వేగంగా చేసేందుకు ఉపయోగపడే కిట్. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఈ కిట్ ను అభివృద్ధి చేసింది.

Dry Swab Test : గుడ్ న్యూస్.. కేవలం రూ.60కే కరోనా టెస్ట్.. 3 గంటల్లోనే రిజల్ట్

Ccmbs Dry Swab Test Cheaper Results Akin To Rt Pcr Tests

Updated On : June 3, 2021 / 9:36 AM IST

Dry Swab Test : డ్రైస్వాబ్‌ (పొడి పరీక్ష).. కరోనా నిర్ధారణ పరీక్షను మరింత చౌకగా, వేగంగా చేసేందుకు ఉపయోగపడే కిట్. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఈ కిట్ ను అభివృద్ధి చేసింది. ఈ కిట్ల వాణిజ్య ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. భారత వైద్య పరిశోధన సమాఖ్య ఈ డ్రైస్వాబ్‌ కిట్ల వినియోగానికి అనుమతిచ్చిన నేపథ్యంలో వాటిని వాణిజ్యస్థాయిలో తయారు చేసేందుకు భారత్‌కు చెందిన గ్లోబల్‌ మెడికల్‌ డివైజెస్‌ కంపెనీ మెరిల్‌ డయాగ్నస్టిక్స్‌ ముందుకొచ్చింది. కిట్ల తయారీకి సీసీఎంబీతో ఒప్పందం చేసుకుంది.

తాము తయారు చేసే ఒక్కో కిట్‌తో 100 పరీక్షలు చేయవచ్చని, ఒక్కో పరీక్షకు అయ్యే వ్యయం రూ.45 నుంచి రూ.60 మధ్య ఉంటుందని మెరిల్ సంస్థ తెలిపింది. ‘‘పొడి పరీక్ష కిట్లను తయారు చేస్తున్న తొలి సంస్థ మాదే. దీంతో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలవుతుంది. దేశంలో కోవిడ్‌ పరీక్షలు పెద్ద సంఖ్యలో చేపట్టేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయి. నెలకు 2 కోట్ల కిట్లను తయారు చేసే సామర్థ్యం మాకుంది. ఇప్పటికే కొవిడ్‌ యాంటిజెన్‌ కిట్లతోపాటు యాంటీబాడీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లను తయారు చేస్తున్నాం’’ అని ‘మెరిల్‌’ ఉపాధ్యక్షుడు సంజీవ్‌ భట్‌ తెలిపారు.

డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీ అంటే…
* కోవిడ్‌ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటి పుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినే స్వాబ్స్‌ అంటారు.
* ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
* అంతేకాకుండా.. స్వాబ్స్‌లోని జీవ పదార్థాన్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు.
* ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్‌నే నేరుగా పరీక్షలు జరిగే కేంద్రాలకు తరలించేందుకు వీలుగా సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీనే డ్రైస్వాబ్స్‌
* సాధారణ ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా ఫలితాలకు ఒకట్రెండు రోజుల సమయం పడితే.. డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీతో మూడు గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు.

డ్రైస్వాబ్‌తో చౌకగా, వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని.. ఆర్‌ఎన్‌ఏ వేరు చేయకుండా నేరుగా పరీక్షించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ పరీక్షలకు రెండు మూడు రెట్లు ఎక్కువ పరీక్షలు చేసేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయన్నారు. కరోనా పరీక్షలకయ్యే సమయం, ఖర్చు దాదాపు సగం వరకూ తగ్గుతాయని సంస్థ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సీసీఎంబీ అభివృద్ధి చేసిన పొడి పరీక్ష కిట్ల తయారీకి పలు సంస్థలు ముందుకు వస్తుండటంతో వాటి లభ్యత పెరగడంతో పాటు ధరలూ తగ్గుతున్నాయి.