కరోనా వ్యాక్సిన్ పై బుధవారం క్లారిటీ…ఢిల్లీ,హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లు రెడీ

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2020 / 09:05 PM IST
కరోనా వ్యాక్సిన్ పై బుధవారం క్లారిటీ…ఢిల్లీ,హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లు రెడీ

Covid vaccine applications తాము డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)సహకారంతో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని డెవలప్ చేయగా, పూణే లోని సీరం కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికాకి చెందిన ఫైజర్ కంపెనీ జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ కలిసి ఓ కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేస్తోన్న విషయం తెలిసిందే .బ్రిటన్, బహ్రెయిన్‌ దేశాలు ఫైజర్- బయోఎన్ టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో భారత్‌ లోనూ ఆ సంస్థ దరఖాస్తు చేసింది.



అయితే, ఈ మూడు ఔషద సంస్థల అప్లికేషన్ లపై రివ్యూ చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)లోని నిపుణుల కమిటీ బుధవారం సమావేశం కానుందని సమాచారం. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కొద్దివారాల్లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా వార్తలు మరింత ఊరటనిస్తున్నాయి.



మరోవైపు, మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న కోట్లాది వ్యాక్సిన్ డోసులను స్టోర్ చేయడానికి ఉష్ణోగ్రతలను అదుపు చేయగల కంటెయినర్లు, జోన్ల ఏర్పాటుకు ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో సన్నాహాలు ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే ఈ ఎయిర్ పోర్టుల్లో ఆధునిక ఫార్మా వ్యాక్సిన్ స్టోరేజీ, ప్రాసెసింగ్ జోన్లు, ప్రత్యేక కూల్ ఛాంబర్లు ఉన్నాయి. ఇవి మైనస్ 20 డిగ్రీల ఉషోగ్రతతో కూడినవి. అలాగే ప్రత్యేక ట్రాలీలు సైతం ఉన్నాయని తెలిపింది. కాగా,కరోనా వైరస్ తొలి రోజుల్లో ఈ రెండు విమానాశ్రయాల నుంచి కోట్లాది పీపీఈ కిట్లు, మందులు రవాణా అయిన విషయం తెలిసిందే.