ChinnaJeeyar : కేంద్రమంత్రులతో చిన్నజీయర్ భేటీ.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని వినతి

216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

ChinnaJeeyar : కేంద్రమంత్రులతో చిన్నజీయర్ భేటీ.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని వినతి

Chinna Jeeyar Swamy Thumb

ChinnaJeeyar Swamy : వచ్చే ఏడాది జరగనున్న రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కేంద్రమంత్రులను ఆహ్వానించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఇవాళ(సెప్టెంబర్ 15,2021) ఢిల్లీలో సమావేశాలతో బిజీగా గడిపిన చిన్నజీయర్ స్వామి.. కేంద్రమంత్రులను సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు రావాలంటూ ఆహ్వాన పత్రికలు అందజేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే, కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మైహోం గ్రూప్ సంస్థల డైరెక్టర్ జూపల్లి రంజిత్‌రావు కూడా పాల్గొన్నారు.

ప్రపంచం నలుమూలల నుంచి అన్ని వర్గాల వారు చేతులు కలిపినప్పుడే శ్రీ రామానుజాచార్యుల సమతా భావన సాధ్యమవుతుందన్నారు శ్రీశ్రీశ్రీ తిదండి చిన్నజీయర్‌స్వామి. భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నిన్న మంగళవారం(సెప్టెంబర్ 14,2021) ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను స్వయంగా కలిసి ఆయన ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను.. ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీజీ.

Chinna Jeeyar Swamy : రామానుజ విగ్రహ ఆవిష్కరణకు రావాలని రాష్ట్రపతికి చిన్నజీయర్‌ స్వామి ఆహ్వానం

శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని ఉన్న విగ్రహ రూపాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్దది. 200 ఎకరాల్లో వేయి కోట్లతో ఈ రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా ఏర్పాటు చేస్తోన్న 216 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. దీని కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. చిన్నజీయర్ స్వామీజీతో పాటు మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మైహోం గ్రూప్ సంస్థల డైరెక్టర్ జూపల్లి రంజిత్‌రావు రాష్ట్రపతితో భేటీ అయ్యారు.