సిద్ధిపేటకు సీఎం కేసీఆర్, పర్యటన షెడ్యూల్

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 06:44 AM IST
సిద్ధిపేటకు సీఎం కేసీఆర్, పర్యటన షెడ్యూల్

CM KCR to Siddipet : సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడతారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట శివారు ప్రాంతంలోని టూరిజం ప్లాజా, ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి మధ్యలో నిర్మించబోతున్న ఐటీ టవర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, డబుల్ బెడ్రూం పంపిణీ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.



మొదటి దశలో 47 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఐటీ టవర్‌ ద్వారా 2 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి హారీశ్‌ రావు తెలిపారు. సిద్దిపేటకు ఐటీ టవర్‌ కేటాయించిన సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు గురువారం మూడు కంపెనీలు ఒప్పందం కూడా కుదుర్చుకుంటాయని చెప్పారు.



షెడ్యూల్ : – 
ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి నుంచి సీఎం రోడ్డు మార్గాన సిద్దిపేటకు పయనం.
11 గంటలకు కొండపాక మండలం దుద్దెడకు చేరుకుంటారు.
11.10కి ఐటీ టవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన.
11.20కి పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం.
11.40కి మిట్టపల్లిలో రైతు వేదిక ప్రారంభం.
12 గంటలకు ఎన్సాన్‌పల్లి శివారులోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభం. అక్కడే వెయ్యి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన.



12.30కి కోమటిచెరువును సందర్శించి నెక్లెస్‌రోడ్డు సందర్శన.
12.45 గంటలకు నర్సాపూర్‌ శివారులోని డబుల్‌ బెడ్రూం మోడల్‌ కాలనీలో సామూహిక గృహప్రవేశాలు.
1.20కి సిద్దిపేట పట్టణంలోని చింతల్‌ చెరువు వద్ద నిర్మించిన మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ప్రారంభం.
1.40 గంటలకు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో నిర్మించిన అతిథి గృహాం ప్రారంభం.
3 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం.



మరోవైపు… కేసీఆర్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్‌. సొంత జిల్లా సిద్ధిపేట నుంచి కేసిఆర్ పర్యటనలు మొదలు కానున్నాయి. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిద్దిపేటలో ప్రారంభించనున్న కేసీఆర్.. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.