Bengal Polls: మైత్రి చెడొద్దు, మాట పడొద్దు.. బెంగాల్ ఎన్నికల హింస నేపథ్యంలో మమతా బెనర్జీపై ఆచీతూచీ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది

Congress vs TMC: పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు అంతా ఇంతా కావు. నామినేషన్ ప్రారంభమైన రోజు నుంచి పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ (Mamata Banerjee) వైఫల్యం వల్లే ఈ అల్లర్లు జరిగాయని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరేమో అల్లర్లకు ఆమె పార్టీ టీఎంసీనే కారణమని ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించింది. అయితే మైత్రి చెడకుండా, హెచ్చరికలతో విమర్శలు చేశారు.
Twitter: పాకిస్తాన్ నుంచి ట్వీట్ చేస్తే, జమ్మూ కశ్మీర్ అని చూపిస్తోందట.. వివాదాస్పదంగా ట్విటర్ తీరు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) స్పందిస్తూ బెంగాల్ లో జరిగిన హింస ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని అన్నారు. ఈ ఎన్నికలను పరిశీలిస్తే చాలా భయమేస్తోందని అంటూనే.. లెఫ్ట్ హయాంలో అల్లర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న మమతా బెనర్జీ.. ఇప్పుడు వాటిని అదుపు చేయాలంటూ సూచించారు. పంచాయతీ ఎన్నికలకు ముందు, తర్వాత తారా స్థాయిలో హింస జరిగిన నేపథ్యంలో ఆయన సోమవారం ట్విటర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
‘‘బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్నది అత్యంత భయానకం. మమత బెనర్జీ ధైర్యసాహసాలు, దృఢ సంకల్పాలను నేను ప్రశంసిస్తుంటాను. కానీ ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం క్షమించరానిది. సీపీఎం పాలనలో ఇటువంటి పరిస్థితిని మీరు ధైర్యంగా ఎదుర్కొన్నారని మాకు తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’’ అని దిగ్విజయ సింగ్ ట్వీట్ చేశారు.
వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిలో కాంగ్రెస్ సహా టీఎంసీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆమె పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రి చెడకుండా, అల్లర్లపై మౌనంగా ఉండకుండా.. ఆచీతూచీ మమతాపై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వాస్తవానికి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటీ చేసింది. అయినప్పటికీ కేంద్రంలో మాత్రం ఒకటిగా ఉండాలని జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన విపక్షాల కూటమిలో నిర్ణయించుకున్నారు.
MLA Perni Nani : దిక్కుమాలిన రాజకీయాల కోసం వాలంటీర్లపై నీచమైన మాటలా..? : పేర్ని నాని
పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం జరిగింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, హత్యలు, దహనాలు, కాల్పులు వంటి సంఘటనలు జరిగాయి. దీంతో బీజేపీ సహా ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 696 బూత్‌లలో పోలింగ్‌ను రద్దు చేసి, సోమవారం రీపోలింగ్ నిర్వహించింది. ముర్షీదాబాద్ జిల్లాలో 175, మాల్డాలో 112, నాడియా జిల్లాలో 89, ఉత్తర 24 పరగణాల జిల్లాలో 46, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 36 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తామని ఆదివారం ప్రకటించింది.
Russia Ukraine War: 500 రోజులు దాటిన రష్యా – యుక్రెయిన్ యుద్ధం.. వార్ ఆగాలంటే అదొక్కటే పరిష్కారం!
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది. ఈ ఎన్నికల్లో 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేశారు. 61,636 బూత్‌లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు అంచెల పంచాయతీ వ్యవస్థలో 73,887 స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి.