MLA Duddilla Sridhar Babu: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనగర్జన బహిరంగ సభ ఆగదు
కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Duddilla Sridhar Babu
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గోనున్నారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, పక్క జిల్లాల నుంచి సుమారు ఐదు లక్షల మంది కాంగ్రెస్ శ్రేణులను తరలించేందుకు ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు.
కాంగ్రెస్ జనగర్జన సభకు వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తల వాహనాలను నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని, తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం, పెద్దఎత్తున చేరికలు ఉండడంతో ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Mallikarjuna Kharge : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : మల్లికార్జున ఖర్గే
పోలీసులు అడుగడుగునా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని,సభకు రాకుండా ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రైవేటు వెహికల్స్‌నుకూడా రానివ్వకుండా చెక్ పోస్టులు పెట్టి పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో సంక్షేమ పథకాలు ఆపేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీగా బీఆర్ఎస్ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. పోలీసులు నిజాయితీగా పని చేయాలని, బీఆర్ఎస్ కు ఏజెంట్లుగా పనిచేయొద్దు కోరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ ఆగదని, మా కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ తట్టుకోవడం కష్టమని శ్రీధర్ బాబు హెచ్చరించారు. అన్నీ గమనిస్తున్నామని, ఇప్పటికైనా తమ సభకు అడ్డంకులు సృష్టించొద్దని పోలీసులను కోరుతున్నామని శ్రీధర్ బాబు అన్నారు.