Congress Jana Garjana Sabha: ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ పార్టీ ఖిల్లా: రాహుల్ గాంధీ కామెంట్స్.. Live Updates
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరుగుతోంది.

Congress Jana Garjana Sabha
Rahul Gandhi: టీపీసీసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే విధంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.
LIVE NEWS & UPDATES
-
ఖమ్మం నుంచే షురూ
కేసీఆర్ విముక్తిని ఖమ్మం నుంచే షురూ చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే డిసెంబరు 9లోపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.
-
ఆదివాసీలకు పోడు భూములు..
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో యూత్ ప్రకటించిందని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నానని తెలిపారు. అందుకు చేయూత పథకాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే, తాము అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేస్తామని అన్నారు.
-
ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ పార్టీ ఖిల్లా: రాహుల్ గాంధీ కామెంట్స్
దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందని రాహుల్ గాంధీ అన్నారు. విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని రాహుల్ చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని అన్నారు.
-
కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలపాలి
కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలపాలని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని చెప్పారు. ఉద్యోగాలు రాక యువత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
-
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అనంతరం పొంగులేటి మాట్లాడారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.
-
సీతక్కను భుజం తట్టి అభినందించిన రాహుల్
ఎమ్మెల్యే సీతక్కను రాహుల్ గాంధీ భుజం తట్టి అభినందించారు. కాసేపట్లో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
-
రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన గద్దర్
ఖమ్మం సభా ప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగగానే చేరుకోగానే గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. వారికి అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టారు ప్రజా గాయకుడు గద్దర్.
-
గన్నవరం చేరుకున్న రాహుల్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం బయలుదేరారు. రాహుల్ గాంధీతో పాటు మాణిక్‌రావు ఠాక్రే, గిడుగు రుద్రరాజు, పలువురు నేతలు ఉన్నారు.
-
బీఆర్ఎస్ వెన్నులో వణుకు..
ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
-
మేమేం అడ్డుకోవడం లేదు: సీపీ
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న జనగర్జన బహిరంగ సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో దీనిపై సీపీ విష్ణు స్పందించారు. జనగర్జనకు వెళ్తున్న వాహనాలను తామేం అడ్డుకోవడం లేదని, తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ డైవెర్షన్ మినహా తాము ఎక్కడా చెక్ పోస్టులు కూడా పెట్టలేదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు.
-
నిర్బంధంలో తెలంగాణ అంటూ..
నిర్బంధంలో తెలంగాణ ఉందంటూ టీపీసీసీ ట్విటర్‌లో పేర్కొంది.
నేటి "తెలంగాణ జన గర్జన" సభకు
ప్రజలు వెళ్ళకుండా..
?బస్సులు బంద్
?ఆటోలు బంద్
?ప్రైవేట్ వాహనాలు బంద్
? చెక్ పోస్టులు పెట్టి కాంగ్రెస్ శ్రేణుల వాహనాలు బంద్
? నాయకులు సభకు రాకుండా ఇంటి దగ్గర బంద్ప్రజలు వెళ్తే..
?దళిత బంధు బంద్
? బీసీలకు లక్ష బంద్
? ఆసరా పించన్ బంద్
?ప్రజలకు నీళ్లు బంద్నిర్బంధంలో తెలంగాణ..
నేటి "తెలంగాణ జన గర్జన" సభకు
ప్రజలు వెళ్ళకుండా..
?బస్సులు బంద్
?ఆటోలు బంద్
?ప్రైవేట్ వాహనాలు బంద్
? చెక్ పోస్టులు పెట్టి కాంగ్రెస్ శ్రేణుల వాహనాలు బంద్
? నాయకులు సభకు రాకుండా ఇంటి దగ్గర బంద్ప్రజలు వెళ్తే..
?దళిత బంధు బంద్
? బీసీలకు లక్ష బంద్
? ఆసరా…— Telangana Congress (@INCTelangana) July 2, 2023
-
జనగర్జన సభ బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది..
ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ నేతల వెన్నులో వణుకుపుట్టిస్తోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్‌పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరించి జన ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర చెయ్యిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని రేవంత్ సూచించారు. సభకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నఅధికారులు వారి పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ హెచ్చరించారు.
-
పోలీసుల ఆంక్షలపై డీజీపీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు వస్తున్న కాంగ్రెస్ కార్యర్తలను పోలీసులు అడ్డుకోవటంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై డీజీపీతో రేవంత్ రెడ్డి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ విజ్ఞప్తికి డీజీపీ సానుకూలంగా స్పందించారు.
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనగర్జన సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సభకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు.
-
పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ జనగర్జన సభకు వస్తున్న వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తనిఖీల పేరుతో వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నట్లు పొంగులేటి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
కాంగ్రెస్ ‘జనగర్జన’లో ప్రసంగించేది ఆ ఆరుగురేనా..
మరికొద్ది సేపట్లో ఖమ్మంలో జనగర్జన బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గోనున్నారు. అయితే, ఈ సభలో రాహుల్ తోపాటు రాష్ట్రానికి చెందిన ఆరుగురు నేతలకు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. వీరిలో.. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరితో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడతారని తెలుస్తోంది.
-
ఖమ్మంలో జనగర్జన బహిరంగ సభ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పటిష్టంగా పోలీసుల ఆంక్షలు అమలవుతున్నాయి. ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు వద్ద ఆర్టీఏ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుంటే వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. రాహుల్ సభకు బొలెరో వ్యాన్‌లలో ప్రజల్ని తరలిస్తే కేసులు నమోదు చేస్తామంటూ ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
-
కాంగ్రెస్ సభకు వస్తే స్కీంలు ఆపేస్తారట.. పొంగులేటి
-
ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్..
బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభను ఫెయిల్ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, ప్రైవేట్ వాహనాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సభకు వచ్చే వందలాది వాహనాలను సీజ్ చేస్తున్నారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్రలను ఛేదించి సభను విజయవంతం చేస్తామని అన్నారు. నేను రోడ్లమీదకు వస్తున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గవద్దు, ఒక్క అడుగుకూడా వెనక్కి వేయకండి అంటూ తన అనుచరులకు పొంగులేటి పిలుపునిచ్చారు.
-
బీఆర్ఎస్ పతనం ఖమ్మం నుంచే మొదలవుతుంది.. పొంగులేటి
కాంగ్రెస్ జనగర్జన సభకు వచ్చే వారిని అధికార పార్టీ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పతనం ఖమ్మం జిల్లా నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు సభకు వచ్చే ప్రజలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని, మీరెన్ని కుట్రలు చేసిన సభను విజయవంతం చేసి తీరుతామని పొంగులేటి అన్నారు.
-
ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకపోయినా సభను విజయవంతం చేస్తాం. ప్రైవేట్ వాహనాల్లో జనం తరలివస్తారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను నిలిపివేస్తూ సభకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
రాహుల్‌కు ఘనస్వాగతం పలకనున్న కాంగ్రెస్ శ్రేణులు
ఖమ్మంలో జనగర్జన సభలో పాల్గొనేందుకు ఖమ్మం రానున్న రాహుల్ గాంధీ.. ప్రత్యేక విమానం ద్వారా సాయంత్రం 4.40గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నారు.
-
రాత్రి 9గంటల వరకు బహిరంగ సభలో రాహుల్ ..
ఖమ్మంలో జనగర్జన బహిరంగ సభలో పాల్గొనేందుకు రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాత్రి 9గంటల వరకు బహిరంగ సభలో ఉంటారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరనున్న రాహుల్ గాంధీ.. సాయంత్రం 4:40 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 5:20 గంటలకు ఖమ్మంకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9గంటల వరకు ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారని సమాచారం. రాత్రి 9గంటల తరువాత రోడ్డు మార్గం ద్వారా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు రాహుల్ చేరుకుంటారు. రాత్రి 11. 20గంటలకు ప్రత్యేక విమానం ద్వారా రాముల్ ఢిల్లీ వెళ్తారు.
-
వరంగల్ జిల్లాలో భగ్గుమన్న వర్గ విభేదాలు ..
ఖమ్మంలో జరిగే జనగర్జన బహిరంగ సభ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు గుప్పుమన్నాయి. బహిరంగ సభకు జనసమీకరణ విషయంలో నర్సంపేట నియోజకవర్గానికి చోటు దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నట్లు తెలిసింది. నర్సంపేటను పక్కనపెట్టి కాంగ్రెస్ అధిష్టానం రూట్‌మ్యాప్ ఖరారు చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నర్సంపేట మినహా ఆరు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను పీసీసీ నియమించింది. నర్సంపేటను, మాజీ ఎమ్మెల్యే దొంతిని పక్కన బెట్టడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. జనసమీకరణకోసం మహబూబాబాద్ పరిధిలోఎమ్మెల్యే సీతక్క సహా జిల్లా నుంచి నలుగురికి చోటు కల్పించగా.. జనగర్జనకోసం మహబూబాబాద్ పరిధిలో ఆరుగురు కో- ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించారు.
-
రాహుల్ పర్యటన సాగేదిలా..
- ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ ఆదివారం మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరుతారు.
- 3.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- సాయంత్రం 4.40 గంటలకు హెలికాప్టర్‌లో ఖమ్మం బయలుదేరుతారు.
- 5.20 గంటలకు ఖమ్మం సభా ప్రాంగణంలోని హెలిప్యాడ్‌లో దిగుతారు.
- 5.30 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు కాంగ్రెస్ పార్టీ జనగర్జన బహిరంగ సభలో పాల్గొంటారు.
- రాత్రి 7గంటలకు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్తారు.
- రాత్రి 9.15గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అవుతారు.
-
సభా ప్రాంగణం వద్ద హెలిప్యాడ్..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలీకాప్టర్‌లో రానుండటంతో హెలిప్యాడ్‌నుకూడా సభా వేదికకు సమీపానే ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ గార్డెన్స్ వెనుకాల స్థలంలో సభాస్థలి ఏర్పాటు చేయగా.. పక్కనే ఉన్న గుట్టపై హెలిప్యాడ్‌ను నిర్మించారు. అక్కడి నుంచి సభా వేదికకు రాహుల్ గాంధీ నేరుగా చేరుకునేలా ప్రత్యేక బారికేడ్లతో రోప్ వే ఏర్పాటు చేశారు.
-
వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
కాంగ్రెస్ పార్టీ జనగర్జన బహిరంగ సభకు హాజరయ్యేవారి వాహనాలకోసం సుమారు 60ఎకరాల్లో నియోజకవర్గాల వారీగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇల్లందు, పాలేరు, పినపాక, ములుగు, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కు రఘునాథ పాలెం ఎస్ఆర్ గార్డెన్స్ మధ్య రహదారి వెంట ఖాళీ స్థలంను సిద్ధం చేశారు.
-
40 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు..
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనగర్జన బహిరంగ సభకోసం 40 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సుమారు 50 అడుగుల ఎల్‌ఈడీ తెరను వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు రెండువైపులా రెండు చొప్పున భారీ ఎల్ఈడీ తెరలతో పాటు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ 15 ఎల్ఈడీ తెరలు అమర్చుతున్నారు. సభా వేదికపై సుమారు 200 మంది ఆసీనులవుతారు. సభా ప్రాంగణం చుట్టూ పార్టీ ముఖ్యనేతల హోర్డింగులు, భారీ ప్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.
-
ఖమ్మం సభకు అంతా సిద్ధం..
-
ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ..
ఖమ్మంలో తలపెట్టిన కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తారని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్యలు చేపట్టారు.
-
కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో పాల్గోనున్న రాహుల్ గాంధీ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇదే సభలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సత్కరిస్తారు.
-
రాహుల్ గాంధీ టూర్ ఇలా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.40 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5గంటలకు బహిరంగసభ ప్రాంగణం వద్దకు రాహుల్ చేరుకుంటారు. రాత్రి 7గంటల వరకు రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ రెండు గంటలు పాటు సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత రాత్రి 8.30 గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.