హైద‌రాబాద్ లో RTC, METRO ఎప్పుడో

  • Published By: madhu ,Published On : June 18, 2020 / 03:54 AM IST
హైద‌రాబాద్ లో RTC, METRO ఎప్పుడో

హైద‌రాబాద్ ప్ర‌జా ర‌వాణాలో కీల‌కమైన ఆర్టీసీ, మెట్రో ఎప్పుడు ప‌రుగులు తీస్తుందో తెలియ‌రావ‌డం లేదు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా…ఆర్టీసీ బ‌స్సులు, మెట్రో రైళ్లు డిపోల‌కు ప‌రిమిత‌మ‌య్యాయి. దీంతో ఆ సంస్థ‌ల‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లుతోంది. జ‌న‌తా క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా..మెట్రో రైళ్లు,  ఆర్టీసీ బ‌స్సులు మార్చి 22వ తేదీ నుంచి నిలిచిపోయాయి. జూన్ లాక్ డౌన్ 5.0లో మ‌రిన్ని స‌డ‌లింపుల‌ను కేంద్రం సూచించింది. కానీ హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌డంతో మెట్రో పై ఆంక్ష‌ల స‌డ‌లింపున‌కు కేంద్రం సుముఖంగా లేద‌ని తెలుస్తోంది.

లాక్ డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా…ఒక్కొక్క‌టి ప్రారంభ‌మౌతున్నాయి. న‌గ‌రంలో ప్ర‌జా ర‌వాణాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. జూన్ మూడో వారంలో మెట్రో అందుబాటులోకి రావొచ్చ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మెట్రో ట్ర‌య‌ల్స్ కూడా ప్రారంభించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాపిస్తుండ‌డం..పాజిటివ్ కేసులు వంద‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌డంతో ఇప్ప‌ట్లో మెట్రోకు ప‌చ్చ‌జెండా ఊప‌రాద‌ని కేంద్రం భావిస్తోంద‌ని స‌మాచారం. 

ప్ర‌జా ర‌వాణా విష‌యంలో కేంద్రం చేసిన సూచ‌న‌లు, కోవిడ్ 19 వ్యాప్తి క‌ట్ట‌డికి స్వ‌యంగా రూపొందించుకున్న భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌తో రైళ్ల‌ను న‌డిపేందుకు హైద‌రాబాద్ మెట్రో రెడీగానే ఉంది. ఈ మేర‌కు కొన్ని ట్ర‌య‌ల్స్ కూడా చేశారు. ప‌క‌డ్బంది చ‌ర్య‌లు చేప‌డుతూ..రైళ్ల‌ను న‌డుపుతామ‌ని..అనుమ‌తినివ్వాల‌ని కోరినా…కేంద్రం నుంచి సానుకూల‌త రాలేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చే వ‌ర‌కు మెట్రో ప‌రుగులు తీసే అవ‌కాశ‌మే లేదు. ఈ మూడు నెలల వ్య‌వ‌ధిలో దాదాపు రూ. 150 కోట్ల ఆదాయం కోల్పోయింద‌ని స‌మాచారం. 

Read: RTA m-Wallet యాప్ తో ప్ర‌యోజ‌నాలు..డౌన్ లౌడ్ చేసుకోండి