‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’ రివ్యూ – ఆకట్టుకునే ఎమోషనల్ లవ్ స్టోరీ..

మౌర్యానీ, విజయ్ శంకర్ జంటగా, ఎస్ వెంకటరమణ దర్శకత్వంలో.. శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఎమోషనల్ లవ్ స్టోరీ.. ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’. ఈ శుక్రవారం మూడు పెద్ద చిత్రాలతో పాటు రిలీజైన ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’ సినిమా ఎలా ఉందో చూద్దాం..

‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’ రివ్యూ – ఆకట్టుకునే ఎమోషనల్ లవ్ స్టోరీ..

Devarakondalo Vijay Premakatha: మౌర్యానీ, విజయ్ శంకర్ జంటగా, ఎస్ వెంకటరమణ దర్శకత్వంలో.. శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఎమోషనల్ లవ్ స్టోరీ.. ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’. ఈ శుక్రవారం మూడు పెద్ద చిత్రాలతో పాటు రిలీజైన ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథలోకి వెళ్తే..
ఊరి పెద్ద సీతారామయ్య (నాగినీడు) ఊరి ప్రజలకు తలలో నాలుకలా వ్యవహరిస్తుంటాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెనుకా ముందు ఆలోచించడు. సీతారామయ్య పరువుకు, గౌరవానికి ప్రాణం పెట్టే మనిషి. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవకి (మౌర్యానీ). కాలేజ్ చదివే దేవకి ఆ ఊరిలో అటో నడుపుకునే విజయ్ (విజయ్ శంకర్) అంటే ఇష్టపడుతుంది. విజయ్ కూడా దేవకిని ప్రేమిస్తాడు. సైకిల్‌పై కాలేజ్ వెళ్లే దేవకి కాలికి గాయం కావడంతో విజయ్ ఆటోలో రోజూ కాలేజ్ వెళ్లమని తండ్రి సీతారామయ్య చెబుతాడు. ఈ క్రమంలో పొలం దగ్గర మాట్లాడుకుంటున్న దేవకి, విజయ్‌లను చూసి గొడవ గొడవ చేస్తాడు సీతారామయ్య మేనల్లుడు. ఈ గొడవతో ఊరి జనం ముందు పరువు పోయిన సీతారామయ్య, విజయ్, దేవకిలను ఊరి నుంచి వెలివేస్తాడు. పెళ్లి చేసుకుని ఊరు బయట తోటబావి దగ్గర పాడుబడిన ఇంట్లో కాపురం ఉంటారు ఈ జంట. ఆత్మాభిమానంతో ఎదిగి తమ తల్లిదండ్రులకు ప్రేమ గొప్పదనం చెప్పాలనుకుంటారు. ఇంతలో విజయ్, దేవకి జీవితాల్లో అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు ఏంటి, ఎక్కడికి దారి తీశాయి అనేది మిగిలిన కథ.

DVP

ఎలా ఉందంటే..
ఇదొక భిన్నమైన ప్రేమ కథగా చెప్పుకోవచ్చు. సందేశాన్ని కమర్షియల్ అంశాలతో కలిపి సగటు ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా రూపొందించారు దర్శకుడు ఎస్ వెంకటరమణ. సినిమా తొలిభాగం పాటలు, ఫైట్స్, హీరో ఫ్రెండ్స్, ఇతర క్యారెక్టర్ల సరదా సన్నివేశాలతో సాగుతుంది. సెకండాఫ్ మాత్రం కథను సీరియస్‌గా చెప్పుకుంటూ వచ్చారు దర్శకుడు. హీరో హీరోయిన్లను ఊరు నుంచి వెలివేసినప్పటి నుంచి అసలు ఎమోషనల్ స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ హీరో విజయ్, హీరోయిన్ మౌర్యానీ నటన ఆకట్టుకుంటుంది. కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకొచ్చిన ఈ జంట ఎవరి మీదా ఆధారపడకుండా జీవితం సాగించడం చాలా మంది నిజ జీవిత ప్రేమికుల ఆత్మ విశ్వాసాన్ని చూపిస్తుంది.
హీరో విజయ్ పాటలు, ఫైట్స్ బాగా చేశాడు. నాయిక మౌర్యానీ సెకండాఫ్‌ను అలా తన నటనతో నిలబెట్టింది. భావోద్వేగ సన్నివేశాల్లో కంటతడి పెట్టించింది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కరణం పాత్ర చేసిన శివన్నారాయణ, తెలంగాణ బామ్మర్ది యాదగిరి క్యారెక్టర్‌లో రచ్చ రవి నవ్వించారు. మనం నిర్లక్ష్యం చేస్తున్న ఓ దురలవాటు మనకే కాదు మన చుట్టు పక్కల వారికి, మనం ప్రేమించిన వారికి ఎంతటి ప్రమాదకరమో చూపించారు దర్శకుడు. తెలుగు సినిమాలో ఇలాంటి పాయింట్‌ను టచ్ చేసిన తొలి దర్శకుడు ఎస్ వెంకటరమణ అనుకోవచ్చు. మొత్తంగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’ ఆలోచింపజేస్తూనే వినోదాన్ని అందిస్తుంది.