Andhra Hospitals : ఏపీలోని పేద వర్గాల ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి వైద్య సేవలు బంద్.. కారణాలు ఇవే..
పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవల స్కీం (NTR Vaidya Seva Scheme) నేటి నుంచి నిలిచిపోనుంది.

NTR Vaidya Seva Scheme
NTR Vaidya Seva Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవల స్కీం నేటి నుంచి నిలిచిపోనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద అందిస్తున్న వైద్యారోగ్య సేవలను అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ స్కీం కింద వైద్య సేవలు నెట్‌వర్క్ఆస్పత్రుల్లో నిలిచిపోయాయి. ఇవాళ్టి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,700 కోట్ల పైనే ఉన్నాయని, నెలనెలా బకాయిలు పెరుగుతున్నా ఉపశమనం కలిగించే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని, బకాయిలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని విడుదల చేసే వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను నిలిపివేయడం జరుగుతుందని ఆషా అధ్యక్ష, కార్యదర్శులు కె. విజయ్ కుమార్, సీహెచ్ అవినాశ్ తెలిపారు.
ప్రభుత్వంలోని పెద్దలను, ఉన్నతాధికారులను పలుసార్లు కలిసి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని, కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ క్రమంలోనే తమ సమస్యను పరిష్కరించే వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయడం జరుగుతుందని ఆషా ప్రతినిధులు తెలిపారు. అయితే, తమ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయొద్దని అసోసియేషన్ ప్రతినిధులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. గత ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.2500 కోట్లు బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆస్పత్రుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వం ఆప్పులను తీర్చాము.. వీటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, అప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ఆస్పత్రుల్లో పథకంకు సంబంధించిన సేవలను నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.