కవిత రాజీనామాను ఆమోదించాలని బీఆర్ఎస్ ఎందుకు కోరట్లేదు? రంగంలోకి బీజేపీ.. ఇకపై..
కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మండలి ఛైర్మన్ చెప్పి కూడా నెల రోజులు దాటిపోవడంతో ఇప్పుడు కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది.
Kavitha
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా ఇంకా ఆమోదం పొందకపోవడం రాజకీయంగా రచ్చరేపుతోంది. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్..ఆ తర్వాత పార్టీనేతలపై ఆమె చేసిన ఆరోపణలతో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు.
సెప్టెంబర్ 3న కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు. అదే రోజు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. అంతే కాకుండా మండలి ఛైర్మన్‌తోనూ కవిత ఫోన్‌లో మాట్లాడి..తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ఈ విషయాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ధ్రువీకరించారు. (Kavitha)
కవిత ఎమోషనల్‌గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, పునరాలోచించుకోవాలని ఆమెను కోరినట్లు కూడా చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మండలి ఛైర్మన్ చెప్పి కూడా నెల రోజులు దాటిపోవడంతో ఇప్పుడు కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది.
Also Read: ఆ ప్రాంత టీడీపీలో ఎవరి దారి వారిదే..! వర్గాలుగా విడిపోయి.. ఎందుకిలా జరుగుతోంది?
సాధారణంగా అయితే అధికార పక్షం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు లేదంటే ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చాలాకాలం పెండింగ్లో పెట్టడం సర్వసాధారణం. కానీ ప్రతిపక్ష, విపక్షాల నుంచి ఇలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు వస్తే స్పీకర్ గాని, మండలి ఛైర్మన్ గాని వెంటనే రాజీనామాలకు ఆమోదం తెలపడం జరుగుతుంది.
కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత..తమ పదవికి రాజీనామా చేసి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా ఎందుకు ఆమోదం పొందడం లేదన్నది రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ. కవిత రాజీనామా ఆమోదం పొందకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న చర్చ బీఆర్ఎస్‌లోనూ జరుగుతోంది.
మండలి ఛైర్మన్‌ను సంప్రదించాలని ప్రయత్నించినప్పటికీ..
కవిత స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి, ఆ తర్వాత మండలి ఛైర్మన్‌తో ఫోన్లో మాట్లాడి తన రిసిగ్నేషన్‌ను ఆమోదించాలని కోరినా ఎందుకు ఆమోదానికి నోచుకోవడం లేదన్నదే చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే తాను మరోసారి మండలి ఛైర్మన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరని కవిత ఆ మధ్య చెప్పారు.
అయితే కవిత రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ పార్టీ కోరకపోవడం కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక ఆమె మాజీమంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ను టార్గెట్ చేస్తున్నా..కవిత రాజీనామాను ఆమోదించాలని బీఆర్ఎస్..మండలి ఛైర్మన్‌ను కోరకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది.
ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన కవిత జాగృతి ఆధ్వర్యంలో జనం బాట పేరుతో యాత్ర చేస్తున్నారు. నిజామాబాద్ నుంచే కవిత యాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు అరవింద్. రేవంత్ రెడ్డికి, కవితకు మధ్య ములాఖత్ ఏంటి.? ఆమె రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అంతేకాదు కవిత రిసిగ్నేషన్‌ను ఆమోదించాలని కోరుతూ మండలి ఛైర్మన్‌కు లేఖ రాస్తామంటున్నారు. కవితతో రేవంత్‌రెడ్డే కొత్త పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మామూలుగా అయితే అధికార పక్షం రాజీనామాను ఆమోదించాలి. బీఆర్ఎస్ ఆ రాజీనామా ఆమోదం కోసం పట్టుబట్టాలి. ఈ రెండూ జరగట్లేదు. కానీ బీజేపీ మాత్రం కవిత రాజీనామా ఆమోదం కోసం తాము లేఖ రాస్తామని చెప్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ మండలికి లేఖ రాస్తుందా.? బీజేపీ లేఖ తర్వాతైనా కవిత రాజీనామాకు ఆమోదం లభిస్తుందా అన్నది చూడాలి మరి.
