ఆ ప్రాంత టీడీపీలో ఎవరి దారి వారిదే..! వర్గాలుగా విడిపోయి.. ఎందుకిలా జరుగుతోంది?

పొత్తూరి రామరాజుపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ప్రాంత టీడీపీలో ఎవరి దారి వారిదే..! వర్గాలుగా విడిపోయి.. ఎందుకిలా జరుగుతోంది?

Updated On : October 28, 2025 / 9:29 PM IST

Narasapuram TDP: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టీడీపీ రాజకీయం రంజుగా మారింది. నరసాపురంలో కూటమి పార్టీ తరఫున జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. నరసాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా పొత్తూరి రామరాజు ఉండగా..అదే నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు కూడా యాక్టీవ్ పాలిటిక్స్ చేస్తున్నారు.

అయితే పొత్తూరి రామరాజు తీరుపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాధవనాయుడు. తనను పార్టీ మీటింగ్‌లకు పిలవకపోయినా..ముఖ్యనేతల పర్యటనకు ఆహ్వానం లేకపోయినా సర్దుకుపోతున్నారట. లేటెస్ట్‌గా ఏఎంసీ ఛైర్మన్‌ ఎంపిక..ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇద్దరు మధ్య కోల్డ్‌ వార్‌ రచ్చకెక్కింది. వైసీపీ నుంచి వచ్చిన నేతకు..పొత్తూరి రామరాజు ఏఎంసీ ఛైర్మన్ పదవి ఇప్పించారనేది మాధవ నాయుడు అభ్యంతరం.

పైగా నరసాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌రాజుతో ములాఖత్‌ రాజకీయం చేస్తున్నారని రామరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు మాధవనాయుడు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని దెబ్బతీసేలా పొత్తూరి రామరాజు తీరు ఉందని అంటున్నారు. నరసాపుర టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు..వైసీపీ మాజీ ప్రసాద్‌రాజు బిజినెస్ పార్టనర్స్..అని ఆరోపణలు చేస్తున్నారు. నరసాపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడానికి రామరాజే కారణమంటూ..మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు మాధవనాయుడు.

Also Read: పార్టీని వీడి వెళ్లిన నేతలకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్..! జగన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ..

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడింది తాము. కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడింది కూడా తామేనని అంటున్నారు మాధవనాయుడు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లు రామరాజు మీద ఒక్క కేసు కూడా లేదని..వైసీపీ నేత ప్రసాద్‌రాజుతో ములాఖత్‌ ఉండటంతోనే రామరాజుపై ఒక్క కేసు కూడా పెట్టలేదని ఆరోపిస్తున్నారు. పొత్తూరి రామరాజు ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఇటీవల కార్యకర్తలు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

రామరాజు వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారంటూ..
నియోజకవర్గంలో అసలైన టీడీపీ నేతలను, కార్యకర్తలను పక్కనపెట్టి వలస వచ్చినవారికి నామినేటెడ్‌ పదవులు కట్టబెడుతూ..రామరాజు వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. నేతల మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తూ రోజురోజుకి పార్టీని బలహీనపడేలా చేస్తున్నారని..నియోజకవర్గ ఇంచార్జ్‌గా రామరాజును తప్పించి పార్టీని బతికించాలని కోరుతూ అధిష్టానంకు ఫిర్యాదుకు చేశారు.

అయితే టీడీపీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఇంతవరకు రియాక్ట్ కాలేదు నరసాపురం నియోజవర్గ టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు. మాజీ ఎమ్మెల్యేగా తనను గుర్తించకుండా, అవమానించడం ఒక ఎత్తు అయితే..వైసీపీ నేతలతో కలిసి..టీడీపీని దెబ్బతీసే కుట్ర చేయడం మరింత ఆవేదన కలిగిస్తుందని అంటున్నారు మాధవనాయుడు.

ఈ విషయాలన్నింటినీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో పొత్తూరి రామరాజుపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కలుపుకుని పోయి..ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల ఆదేశాలతోనైనా..నరసాపురం టీడీపీలో గ్రూప్‌వార్‌కు చెక్‌ పడుతుందో లేదో చూడాలి మరి.