టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా?
తెలంగాణలోని కరీంనగర్‌లో రూ.30 కోట్లతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు.
వైకుంఠద్వార దర్శనాలపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. వైకుంఠద్వార దర్శనాలను గతంలోలాగే 10 రోజులు పాటు నిర్వహిస్తామని చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు జారీ విధానాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని బీఆర్ నాయుడు అన్నారు. సాధ్యమైనంత ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: ఆ ప్రాంత టీడీపీలో ఎవరి దారి వారిదే..! వర్గాలుగా విడిపోయి.. ఎందుకిలా జరుగుతోంది?
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడి అదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 5 వేల ఆలయాలు నిర్మాణానికి ఆమోద ముద్ర వేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాల వితరణ చేపట్టనున్నామని తెలిపారు. రూ.37 కోట్లతో ఒంటిమిట్టలో వంద గదులతో వసతి సముదాయం నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు.
మరో రూ.3 కోట్లతో ఒంటిమిట్టలో పవిత్రవనం నిర్మాణం ఆమోదం తెలిపినట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. టీటీడీ గోశాల నిర్వహణపై ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తిరుమలలోని టీటీడీ గదుల బాడుగల క్రమబద్ధీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ నాయుడు చెప్పారు. కాణిపాకంలో రూ.25 కోట్లతో టీటీడీ అతిథి గృహం, కల్యాణ మండపాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తెలంగాణలోని కరీంనగర్‌లో రూ.30 కోట్లతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ సెల్‌లో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించామని అన్నారు. ఏసీబీ తో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హాయాంలో టీటీడీ కొనుగోలు చేసిన అన్ని వస్తువుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని బీఆర్ నాయుడు అన్నారు. ఉదాహరణకు.. రూ.350 -రూ. 400 విలువచేసే శాలువాను రూ.1,300 పెట్టి కొనుగోలు చేసి రూ.50 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.
ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించి… అక్రమాలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు టీటీడీ పరిధిలోని అన్ని హాస్పిటల్స్ కు కలిపి డైరెక్టర్‌గా డాక్టర్ జగదీశ్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
