Congress: రూ.25 కోట్లు.. యెన్నం డిమాండ్ వెనుక మర్మమేంటి?
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?
Yennam Srinivas Reddy
Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు మరో ఎమ్మెల్యే హాట్ టాపిక్‌గా మారారు. గతంలో అనిరుధ్ రెడ్డి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి, మందుల సామేలు లాంటి వాళ్ళు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తూ కలకలం రేపితే..ఇప్పుడు మరో ఎమ్మెల్యే తీరు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో కొత్త చర్చకు తెరలేపారు.
ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్‌మెంట్ చేయలేకపోయామంటున్నారాయన. చావులు, పెండ్లీలు, శుభకార్యాలకు వెళ్లడం తప్ప..చేసిందేమి లేదని చెప్పుకొస్తున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా నియోజకవర్గానికి ఏడాదికి రూ.25 కోట్ల నిధులు ఇవ్వాలని..అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారన్నది ఆయన ప్రతిపాదన.
యెన్నం ప్రతిపాదనకు అందరూ ఎమ్మెల్యేల మద్దతు దక్కుతుందట. ఆయన వాదనకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలంతా జై కొడుతుండటం సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. ఇవ్వలేమంటే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ..ఇద్దామంటే నిధుల లేమి సమస్యగా మారిందట. ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు 119 నియోజకవర్గాలకు దాదాపు 3వేల కోట్లు ఏడాదికి ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: పార్టీని వీడి వెళ్లిన నేతలకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్..! జగన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ..
ఇప్పటికే సర్కార్ ఖజానాలో పైసల్లేక..సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదన్న విమర్శలు ఫేస్ చేస్తుంది రేవంత్ సర్కార్. అలాంటిది ఎమ్మెల్యేలకు ఏడాదికి 25 కోట్లు డెవలప్‌మెంట్ ఫండ్స్ ఇవ్వడం అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యేకు నేరుగా 25 కోట్లు ఇచ్చేస్తే ఇంకా మంత్రులను, ముఖ్యమంత్రిని ఎవరు పట్టించుకుంటారన్న టాక్ కూడా నడుస్తుందట.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిందట. వాస్తవానికి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొద్ది కాలం పాటు బాగానే ఉన్నా..ఈ మధ్య కాలంలో ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పుడైతే ఆయన రూ.25 కోట్ల నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనపైనే చర్చ జరుగుతున్నప్పటికీ..బ్యాగ్రౌండ్‌లో ఏదో నడుస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో అనిరుధ్ వెనుక ఉండి యెన్నం నడిపించారా?
రేవంత్ ప్రభుత్వ తీరుపై ఫస్ట్ టైమ్ అసమ్మతి రాగం వినిపించిన అధికార పార్టీ నేత కూడా యెన్నం శ్రీనివాస్‌రెడ్డినేనట. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు హోటల్‌లో..జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో పదిమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో అనిరుధ్ వెనుక ఉండి నడిపించిందంతా యెన్నం శ్రీనివాస్‌రెడ్డేనని పార్టీలో ఓ చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాత ఒక ప్రైవేటు ల్యాండ్ వ్యవహారంలోనూ పెద్ద దుమారమే నడిచింది.
ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా..పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ తర్వాత మరో ఎపిసోడ్‌లో ఏకంగా అప్పటి హైదరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్‌పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంతే జోక్యం చేసుకొని..ఎమ్మెల్యే యెన్నంను మందలించారనే టాక్ అప్పట్లో వినిపించింది.
ఇక ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ. 25 కోట్ల నిధులు ఇవ్వాలన్న యెన్నం ప్రతిపాదన సర్కార్‌కు ఇబ్బందికరంగా మారిందట. ప్రభుత్వం నుంచి ఆశించిన పనులు జరగడం లేదంటూ..గ్రామాల్లో పనులు చేయలేక తిరగలేకపోతున్నామని కామెంట్స్ చేస్తూ 25 కోట్ల ప్రతిపాదనకు బీజం పోశారు యెన్నం. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో..ఎమ్మెల్యేగా ఆయన చేసిన కామెంట్స్ ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారాయట. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పరిధిలో 25 కోట్ల ఫండ్స్ ఇవ్వాలంటూ గొంతేత్తుతున్న యెన్నంకు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెరుగుతోందట.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో వరుస పరిణామాలు సర్కారును, పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంత్రుల పంచాయతీ పీక్స్‌కు చేరింది. అటు ఎమ్మెల్యేల గిల్లికజ్జాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంతలో యెన్నం సరికొత్త ప్రతిపాదనతో సర్కార్‌ను సతమతం చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన యెన్నం కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా? అనేది సొంత పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదట. ఈ క్రమంలో దీంతో యెన్నంను ఎలా డీల్ చేయాలనే దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే యెన్నం దారిలోకి వస్తారా..లేక యెన్నం ప్రతిపాదనకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.
