Pollution: ఆస్పత్రులు కిటకిట.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.

Pollution: ఆస్పత్రులు కిటకిట.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

Air Pollution Watch Live Updates Smog Continues To Choke Delhi As Aqi In 'severe' Category

Updated On : November 14, 2021 / 8:22 AM IST

Delhi-NCR: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు.. కరోనాతో ఇటీవల ఊపిరితిత్తులలో సమస్యలు వచ్చినవారు.. ఈ కాలుష్యం కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం.

ఢిల్లీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్మాణ పనులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రేపటి నుంచి వారం రోజుల పాటు విద్యార్థులకు ఫిజికల్ స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఒక వారం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేట్ కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు 100శాతం అనుమతివ్వాలని కోరాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాలు తగ్గుతాయని భావిస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. అవసరమైతే లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకి తీసుకుంటున్న చర్యలపై రేపు(15 నవంబర్ 2021) మరోసారి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. కాలుష్యం ఉన్న విధానం చూస్తుంటే, ఇప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందని, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రోగులకు పెద్ద సమస్య ఇదేనని డాక్టర్లు చెబుతున్నారు.

కోవిడ్ నుంచి, ఇంకా కోలుకోని రోగులకు.. కాలుష్యం కారణంగా కోలుకోవడానికి సమయం పడుతుంది అని అంటున్నారు. కాలుష్యం వారిని ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు చాలావరకు మందులు లేకుండా జీవిస్తున్నారు. ప్రస్తుతం కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్య ఉందని, తనిఖీ చేయగా అదే తేలిందని అంటున్నారు.

కాలుష్యం ప్రభావంతో కళ్లలో మంటలు, ముక్కులో నీరు కారడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుందని, శరీరంలోకి వెళ్లినప్పుడు, అది రక్తంలోకి వెళ్లి గుండె సమస్యలు పెరుగుతాయని.. క్యాన్సర్‌లు వచ్చే అవకాశం కూడా ఉందని, వీలైనంతవరకు బయటకు రావద్దని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరంలోని ప్రతి భాగాన్ని కాలుష్యం ప్రభావితం చేస్తుందని, దగ్గు, శ్వాసకోశ సమస్యతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతుందని అన్నారు.