చిక్కుల్లో యువరాజ్.. ఎఫ్ఐఆర్ నమోదు!

చిక్కుల్లో యువరాజ్.. ఎఫ్ఐఆర్ నమోదు!

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా గతేడాది భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హర్యానాలోని హిసార్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది, దళిత మానవ హక్కుల కన్వీనర్ రజత్ కల్సన్ ఫిర్యాదు మేరకు.. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. యువరాజ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ గతేడాది జూన్ 2న ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు యువరాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

సోషల్ మీడియాలో తన తోటి క్రికెటర్లతో సంభాషణ సందర్భంగా మాజీ క్రికెటర్ దళిత సమాజం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదుదారు ఆరోపించారు. నివేదిక ప్రకారం, ఎనిమిది నెలల క్రితం ఫిర్యాదు చేయడంతో యువరాజ్ సింగ్‌పై హిసార్ లోని హన్సీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. యువరాజ్‌పై ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఐపిసి సెక్షన్లు 153, 153ఏ, 295, 505తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌) చట్టానికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి.

గతేడాది లాక్‌డౌన్‌లో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ చాట్ సందర్భంగా యువరాజ్ వాడకూడని పదాలను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పదాన్ని యువరాజ్ ఇక్కడ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్ధేశించి చేశారు. అలా చేసినందుకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అనంతరం యువరాజ్ సింగ్ ఇదే విషయమై బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.

యువరాజ్ సింగ్ భారతదేశం కోసం 40 టెస్టులు, 304 వన్డేలు మరియు 58 టి 20 ఇంటర్నేషనల్‌లలో పాల్గొన్నాడు. ఇందులో అతను వరుసగా 1900, 8701 మరియు 1177 పరుగులు చేశాడు. యువరాజ్ టెస్టుల్లో 9, వన్డేల్లో 111, టీ 20 లో 28 వికెట్లు పడగొట్టాడు. 2007 లో టీమిండియా టీ 20 ప్రపంచ కప్, 2011 లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో యువరాజ్ ఉన్నారు.