Heavy Rains: ఉత్తరాదిన వరద బీభత్సం.. కుండపోత వర్షాలతో కొట్టుకుపోతున్న వాహనాలు, ఇళ్లు.. వీడియోలు వైరల్

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు జలమయంగా మారాయి. మనాలి ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో బస్సు కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Heavy Rains: ఉత్తరాదిన వరద బీభత్సం.. కుండపోత వర్షాలతో కొట్టుకుపోతున్న వాహనాలు, ఇళ్లు.. వీడియోలు వైరల్

Gushing Waters Swallow Bus In Seconds

Updated On : July 10, 2023 / 2:13 PM IST

Himachal Pradesh: ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, రాజస్థాన్‌లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో 33 గంటల్లో 258.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ఢిల్లీలో పాఠశాలలు మూసివేశారు. సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే, జులై 15 వరకు భారీ, తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5:30 వరకు లోధి రోడ్ ప్రాంతంలో గరిష్టంగా 116.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Heavy Rains : నదులను తలపిస్తున్న ఢిల్లీ రహదారులు.. 22కి పెరిగిన మృతుల సంఖ్య

ఢిల్లీలో వర్షాల పట్ల ఆప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యలను ఆప్ మంత్రులు, మేయర్ శైలి ఒబెరాయ్ పరిశీలించారు. ఢిల్లీ యమునా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో నదీ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని హతిని కుండ్ బ్యారేజి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు యమునా నదిలో నీటిమట్టం పెరగడంతో యమునా నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain Alert : ఇళ్లలోనే ఉండండి..ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోగా, కార్లు కాగితపు పడవల్లా తేలుతున్నాయి. ఈ భయానక దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని మనాలిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందరూచూస్తుండగానే సెకన్లలో ఆ బస్సు నీట మునిగి కొట్టుకుపోయింది. బస్సులో 20 మంది ప్రయాణిస్తున్నారు. వారిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. బస్సు నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సంభవించిన వరదలతో కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే 14మంది ప్రాణాలను కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండచరియలు విరిగిపడటంతో మండి – కులు జాతీయ రహదారిని మూసివేశారు. మరో 24గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు.