Dharmapuri Srinivas: పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

Dharmapuri Srinivas: పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

D. Srinivas

Updated On : February 27, 2023 / 12:40 PM IST

Dharmapuri Srinivas: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం ఆరోగ్యం మరింత విషమించడంతో హుటాహుటీన సిటీ న్యూరో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డీఎస్ తీవ్ర అనారోగ్యంకు గురికావటంతో ఆయన తనయుడు, ఎంపీ అర్వింద్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటీన ఆస్పత్రికి వెళ్లారు.

T.Congress : కాంగ్రెస్‌‌లోకి డీఎస్.. ముహూర్తం ఫిక్స్

డి.శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేయడమేకాక అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్‌గా డి. శ్రీనివాస్ జోడెద్దుల్లా పనిచేసి  2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో డీఎస్ పాత్ర కీలకమనే చెప్పాలి. ఆ సమయంలో డీఎస్ పేరు సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది.

 

తెలంగాణ ఏర్పాటు తరువాత కొద్దికాలానికి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ టీఆర్ఎస్‌లో డీఎస్‌కు పెద్దపీట వేశారు. కొద్దికాలానికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ అధిష్టానంకు, డీఎస్‌కు మధ్య మనస్పర్థలు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి డి. శ్రీనివాస్‌రావు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం  ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటీన సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.