Godavari River : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 62.80 అడుగులకు చేరిన నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

Godavari River Telangana Godavari River Crossed 62.80 Feet Level At Bhadrachalam
Godavari River : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరిగిపోతోంది. గోదావరి నీటిమట్టం 62.80 అడుగులకు చేరుకుంది. వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. రేపటి వరకూ (శుక్రవారం) 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి 17,14,848 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. గోదావరికి వరద ఉధృతిపై భద్రాచలం వద్ద ఇప్పటికే అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 45 గ్రామాల ప్రజలను, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు.
గోదావరి వరద ఉధృతి గంటగంటకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందా? అంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి ప్రభావిత నాలుగు జిల్లాల కలెక్టర్లతో మంత్రి పువ్వాడ, సీఎస్ సోమేశ్ కుమార్ టెలికాన్పిరేన్స్ నిర్వహిస్తున్నారు. గోదావరికి వరదనీరు ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 63.50 అడుగులకు చేరిందని, రానున్న 24 గంటల్లో 75 నుంచి 80 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. భద్రాచలంలో 5వేల ఉసిక బస్తాలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశించారు. ఎగువ నుంచి భద్రాచలంకు 30 లక్షల క్యూసెక్కుల వరదనీరు 24 గంటల్లో రానున్నది అని అంచనా వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మంత్రి పువ్వాడ అధికారులకు సూచనలు చేస్తున్నారు.

Godavari River Telangana Godavari River Crossed 62.80 Feet Level At Bhadrachalam
గోదావరికి వరదనీరు ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం :
మరోవైపు.. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, బూర్గంపాడు , అశ్వాపురం, కరకగూడెం, భద్రాచలం మండలాల పరిధిలోని ముంపుకు గురయ్యే గ్రామాల్లోని సుమారు 4,080 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గోదావరి వరద ఉధృతి గంటగంటకు పెరుగుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అధికార యంత్రాంగం భద్రాచలంలోనే మకాం వేసింది. రాత్రిమొత్తం అధికారులు గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తూ అందుకు తగిన విధంగా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 62అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఏలూరు వద్ద గోదావరికి అనూహ్యంగా వరద ఉధృతి పెరిగింది. పోలవరం వద్ద 15లక్షల క్యూసెక్కులకు వరదనీరు చేరింది. అప్పర్ స్పిల్ వే 35 మీటర్లు, డౌన్ స్పిల్ వే 27 మీటర్లకు నమోదైంది. 15లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో కుక్కునూరు, వేలేరుపాడు మడలాల పరిధిలోని ముంపుకు గురైన గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా దవళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే అచంట, యలమంచిలి, పెరవళి మడలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు.
Read Also : Godavari river : భద్రాచలంలో 61 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం..వంతెనపై రాకపోకలు బంద్