CM KCR : లాక్ డౌన్ తప్పవేరే మార్గం లేదు..త్వరలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని.. అనవసరంగా రోడ్లపైకి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు.

CM KCR : లాక్ డౌన్ తప్పవేరే మార్గం లేదు..త్వరలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Cm Kcr Mgm

Outsourcing Employees : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని.. అనవసరంగా రోడ్లపైకి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. వరంగల్‌ ఎంజీఎం, సెంట్రల్‌ జైల్‌ను సందర్శించిన సీఎం.. త్వరలోనే ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెబుతామన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం : –
ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా.. రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినతరం చేయాలన్నారు తెలంగాణ సీఎం. రైతన్నకు వెన్నుదన్నగా వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం కలగనివ్వద్దని సూచించారు. మరికొన్ని రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించే టైమ్‌ కావడంతో.. రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయని.. ధాన్యం సేకరణ మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఎంజీఎంలో కేసీఆర్ : –
కరోనా బాధితులను పరామర్శించేందుకు వరంగల్ ఎంజీఎంలో పర్యటించారు సీఎం కేసీఆర్‌. ఐసీయూ, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్లను.. చికిత్స గురించి తెలుసుకున్నారు. వారంతా త్వరలోనే కొలుకుంటారనీ భరోసా కల్పించారు. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు. ఎంజీఎంలో మాతా శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు సీఎం. ఆ తర్వాత వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు సీఎం కేసీఆర్.. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి.. వారి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ కలెక్టరేట్ లో సమీక్ష : –
లాక్‌డౌన్‌పై వరంగల్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులు, కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణపై చర్చించారు. కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు జరక్కపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్‌.. లాక్‌డౌన్‌ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

అలసత్వం వద్దు : –
రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా.. లాక్డౌన్ అమలు చేస్తున్నామన్నారు తెలంగాణ సీఎం. ఆంక్షలు సడలించిన 4 గంటలు మినహా.. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, అత్యవసర సేవలను, పాస్‌లు ఉన్నవాళ్లను మినహాయించి, ఇతరులపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని తేల్చిచెప్పారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని.. వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని ఆదేశించారు సీఎం.

సమస్యలను పరిష్కరిస్తాం : –
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెబుతామన్నారు సీఎం కేసీఆర్‌. కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, ఇందుకోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు కేసీఆర్‌.

Read More : AP COVID : వ్యాక్సిన్ల కొనుగోళ్లకు రూ. 50 కోట్లు