భార్య కోసం దొంగగా మారిన భర్త, అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు

భార్య కోసం దొంగగా మారిన భర్త, అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు

arrested

husband becomes thief for wife sake: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం దొంగగా మారాడో భర్త. తన ఎదురింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. అయితే, ఆ దొంగతనం చేయడానికి భర్త చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు. అతడి చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు వారికి.

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన శ్రీను(27) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాకుళానికి చెందిన యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మోసయ్యపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భార్య గర్భవతి కావడంతో కొద్ది నెలల క్రితం ఆమె ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే, భార్యకు చెప్పకుండా ఆమె బంగారాన్ని శ్రీను కుదువ పెట్టాడు. వచ్చిన సొమ్ముతో ఆటో కొన్నాడు. ఈ విషయం భార్యకు తెలియడడంతో ఆమె ఆగ్రహించింది. నాకు తెలీకుండా బంగారం తాకట్టు పెడతావా అని చీవాట్లు పెట్టింది. అంతేకాదు తన నగలు తిరిగి తీసుకొస్తే తప్ప కాపురానికి రానని తెగేసి చెప్పింది.

భార్య కాపురానికి రానని చెప్పడంతో శ్రీనుకి దిమ్మతిరిగిపోయింది. సడెన్ గా డబ్బు సమకూర్చుకునే దారి లేకపోవడంతో అతడి ఆలోచన దొంగతనం వైపు మళ్లింది. అదే తడవుగా తన ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిపై అతడి కన్ను పడింది. ఫిబ్రవరి 12న ఆ ఇంట్లో నివాసం ఉండే కృష్ణవేణి.. దిబ్బపాలెం సెజ్‌ కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. రాత్రికి ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో శ్రీను చోరీకి ప్లాన్‌ చేశాడు. ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.50 వేల క్యాష్ దోచుకెళ్లాడు. ఆ తర్వాత తన భార్య బంగారం తాకట్టు పెట్టిన ఫైనాన్స్‌ సంస్థలోనే ఈ నగల్ని కూడా కుదువ పెట్టి.. తన భార్య నగలు తీసుకుని అత్తారింటికి వెళ్లిపోయాడు.

తన ఇంట్లో దొంగలు పడి చోరీ చేశారని గుర్తించిన వెంటనే కృష్ణవేణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొదట చుట్టుపక్కల వారిపై నిఘా పెట్టారు. శ్రీను కనిపించడం లేదని తెలిసిన వెంటనే అతడిపై అనుమానం వచ్చింది. శ్రీనును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే.. అసలు విషయం పూసగుచ్చినట్టు చెప్పేశాడు శ్రీను. చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.