Huzurabad By Poll Schedule : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలోని హుజూరాబాద్ , ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

Huzurabad By Poll Schedule : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Huzurabad Bypoll

Huzurabad By Poll Schedule : తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని కడపజిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు.  అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది.  అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి…. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు.

ఏపీలోని కడప జిల్లా బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతిచెందడంతో.. బద్వేల్‌లోనూ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్‌ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.