Hyderabad Dog Attack: కుక్కల స్వైరవిహారంపై కాంగ్రెస్ ఫిర్యాదు.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు, మేయర్ ఏం చేస్తున్నారు?

Hyderabad Dog Attack: గత సంవత్సరం 80 వేల మంది కుక్క కాటుకు గురయ్యారు. కేటీఆర్.. గచ్చిబౌలి, కోకపేట్ చూపించి ఇదే అభివృద్ధి అంటున్నారని..

Hyderabad Dog Attack: కుక్కల స్వైరవిహారంపై కాంగ్రెస్ ఫిర్యాదు.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు, మేయర్ ఏం చేస్తున్నారు?

హైదరాబాద్ అంబర్ పేట్ లో కుక్కల దాడిలో బాలుడి మరణంపై మానవ హక్కుల కమిషన్ కు కాంగ్రెస్ నేతలు బుధవారం ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు పెట్టాలని హెచ్ ఆర్సీని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ సందర్భంగా “షేమ్ కేటీఆర్, షేమ్ మేయర్” ఫ్లకార్డులను కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

కేటీఆర్ కు తీరిక లేదా?
కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ కార్ రేస్ మీద ఉన్న దృష్టి ప్రజలను కాపాడటంలో లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. మున్సిపల్ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక కేటీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని.. మేయర్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదని మండిపడ్డారు. హెచ్ఆర్సీ చైర్మన్ పదవి ఖాళీ అయి రెండు నెలలు అవుతున్నా ఇప్పటికీ నియామకం జరపలేదని తెలిపారు.

మేయర్ పదవికి విజయలక్ష్మి అనర్హురాలు
ప్రజల సమస్యలు పట్టని గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవికి అనర్హురాలని మాజీ మంత్రి పుష్పలీల విమర్శించారు. కేటీఆర్ కు ఎలక్షన్ మీద ఉన్న దృష్టి.. ప్రజా సమస్యలపై లేదన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం.. దాడిపై కేటీఆర్ స్పందన

బాధ్యులపై చర్యలేవి?
కుక్క చనిపోతే కేసు బుక్ చేస్తరు, అదే కుక్క మనిషిని కరిస్తే కేస్ బుక్ చేయరా అని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నిలదీశారు. బాలుడి మరణానికి కారణం అయిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గత సంవత్సరం 80 వేల మంది కుక్క కాటుకు గురయ్యారని వెల్లడించారు. కేటీఆర్.. గచ్చిబౌలి, కోకపేట్ చూపించి ఇదే అభివృద్ధి అంటున్నారని.. తనతో వస్తే ఎన్ని సమస్యలు ఉన్నాయో చూపిస్తానని సవాల్ విసిరారు. జనం చస్తున్నా జీహెచ్ఎంసీకి పట్టదా అని నిలదీశారు.

జీహెచ్ఎంసీ విఫలం
కేటీఆర్ కుక్క చనిపోతే ఇద్దరి డాక్టర్లని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. శునకాల దాడిలో బాలుడు చనిపోతే కనీసం పట్టించుకోలేదని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ కార్పొరేటర్లు విమర్శించారు. కుక్కలకు తిండి లేకుండా పోవడం వల్లే కరుస్తున్నాయన్న మేయర్ వ్యాఖ్యలు విడ్డూరమని మండిపడ్డారు. శునకాల దాడుల నియంత్రణకు జీహెచ్ఎంసీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. శునకాల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ కమిషనర్ కు కాంగ్రెస్ కార్పొరేటర్లు వినతిపత్రం ఇచ్చారు.