Tamil Movies: సినీ వెలుగంతా తమిళ పరిశ్రమదే.. కానీ అదంతా గతం!

సూపర్ స్టార్స్ తెరపైకొచ్చిన ఇండస్ట్రీ అది. క్రేజీ కంటెంట్ పరిచయమైంది అక్కడి నుంచే. ఇలా ఎలా ఆలోచిస్తున్నారబ్బా అని..

Tamil Movies: సినీ వెలుగంతా తమిళ పరిశ్రమదే.. కానీ అదంతా గతం!

Tamil Movies

Tamil Movies: సూపర్ స్టార్స్ తెరపైకొచ్చిన ఇండస్ట్రీ అది. క్రేజీ కంటెంట్ పరిచయమైంది అక్కడి నుంచే. ఇలా ఎలా ఆలోచిస్తున్నారబ్బా అని ఇండియన్ మేకర్స్ ముక్కున వేలేసుకునే వారంటే అది అతిశయోక్తి కాదు. అవును కోలీవుడ్ పరిశ్రమ అంటే నికార్సైన సరుకును పుట్టిస్తుందనే పేరు. కానీ అది గతం. ఇప్పుడు తెలుగు, మలయాళ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలు నేషనల్ వైడ్ పేరుతెచ్చుకుంటుంటే… కోలీవుడ్ మాత్రం అక్కడే ఆగిపోయింది. మన దగ్గర రాజమౌళిని తలదన్నే దర్శకులే లేరా అని తమిళ్ ఆడియెన్స్ చిరాకు పడుతున్నారంటే… అసలేమైంది… అరవ మేకర్స్ కి?

Tamil Movies: కోలీవుడ్ కి ఏమైంది.. గుణపాఠం నేర్పేదెవరు?

ఓ అపూర్వ సహోదరులు.. ఓ రోజా.. ఓ భారతీయుడు.. ఓ బొంబాయి, నరసింహ, ప్రేమదేశం, గజిని, అపరిచితుడు, రోబో.. ఇలా చెప్పుకుంటూపోతే తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా పాన్ ఇండియా సబ్జెక్ట్ ఉన్న సినిమాలు.. సూపర్ హిట్స్ కనిపిస్తాయి. కానీ ఈ వెలుగంతా కోలీవుడ్ గతానిదే. ఇప్పుడక్కడ టార్చిలైట్ వేసి వెతికినా పెద్ద హీరోల దగ్గర ఓ భారీ బ్లాక్ బస్టర్ కనిపించడం లేదు. ఇండియన్ ఆడియెన్స్ ను వదిలేస్తే.. మొదటి నుంచి టార్గెట్ చేసిన తెలుగు వాళ్లు కూడా ఇప్పుడసలు తమిళ్ కంటెంట్ ను ఇష్టపడటం లేదు. పాన్ ఇండియా వెలుగులు కాదు కదా.. డబ్బింగ్ చేసి వదిలినా తమిళ్ క్రేజీ స్టార్ సినిమాను పట్టించుకునే వాళ్లు కరువయ్యారు.

Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!

హీరోల్లో రజనీకాంత్, కమల్ హాసన్.. దర్శకుల్లో మణిరత్నం, శంకర్ తర్వాత బిగ్ డ్రీమ్ తో సినిమాలు చేసే వారు తమిళ్ ఇండస్ట్రీలో మిస్ అయ్యారు. సూర్య లాంటి వాళ్లు మెరిపించినా భారీ కమర్షియల్ హిట్ కొట్టలేకపోతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజింగ్ డైరెక్టర్స్ మాత్రం లేరన్నది అక్కడి వారు చెప్తున్నదే. ఎంతసేపు రొడ్డకొట్టుడు మూస కథల్నే అటు ఇటు మార్చే డైరెక్టర్స్ తప్ప.. టార్గెట్ ఇండియా అనే మాటే వినిపించడం లేదు. అజిత్, విజయ్ లాంటి వారు అక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉన్న హీరోలు. కానీ ఫ్యాన్స్ మాయలో పడి వాళ్లు ఎంతసేపు సేమ్.. మూస కథల్నే చేస్తున్నారు కానీ.. పరిధి దాటి ఆలోచించడం కొత్త ప్రయోగాలు చేయడం మానేసారు.

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

మాస్ గా కనిపించాలి.. డాన్ లా ఊర్లని ఏలెయ్యాలి. జనాల్ని చిత్రహింసలు పెట్టే పవర్ఫుల్ విలన్ ని ఢీ కొట్టాలి. ఎంత సేపు ఇదే సబ్జెక్ట్. ఒకరని కాదు రజనీ నుంచి మొదలుపెడితే.. కోలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇలానే తయారయ్యారు. అయితే ఇదే స్టోరీ లైన్ తో బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు కూడా. సరైన ఎలివేషన్ సీన్స్, ట్రెమండస్ మ్యూజిక్, అదిరే డైలాగ్స్, కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్.. ఇవన్నీ ఉండి సమపాళ్లలో పడితే నార్మన్ లైన్ నే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తెరకెక్కించవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా తోపు డైరెక్టర్స్ చేస్తున్నది అదే. కానీ అలా ఆలోచించడమే మానేసినట్టుంది కోలీవుడ్.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

అలా అని తమిళ్ లో మంచి సినిమాలు రావట్లేదా అంటే లేదని చెప్పలేము. ఎందుకంటే 100 కోట్లను క్రాస్ చేసిన డాక్టర్, మానాడు లాంటి సినిమాలు ఈమధ్య వచ్చినవే. ఓటీటీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ లాంటి ప్రాజెక్ట్స్ అక్కడివే. పరియేరుం పెరుమాళ్, సూపర్ డీలక్స్, ఖైదీ, అసురన్, 96 ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఇవి భారీ కమర్షియల్ లెక్కల్లో ఇమడవు. పోనీ ఇంత మార్జిన్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంచుకుని పాన్ ఇండియా ఆడియెన్స్ ను కోలీవుడ్ ఎందుకు టార్గెట్ చేయలేకపోతుంది అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.