1971 War Anniversary : అందుకు భయపడే..ఇందిర పేరును మోదీ సర్కార్ విస్మరించింది!

మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.1971 యుద్ధానికి సంబంధించి ఢిల్లీలో కేంద్రం ఓ స‌మావేశం

1971 War Anniversary : అందుకు భయపడే..ఇందిర పేరును మోదీ సర్కార్ విస్మరించింది!

Rahul Indira

Rahul Gandhi : మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.1971 యుద్ధానికి సంబంధించి ఢిల్లీలో కేంద్రం ఓ స‌మావేశం నిర్వ‌హించింద‌ని, ఆ స‌మావేశంలో అస‌లు ఇందిరా గాంధీ పేరును కూడా పలుకలేదని తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

1971లో పాకిస్తాన్​పై యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లోని పరేడ్​ గ్రౌండ్​లో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ…”1971​ యుద్ధంపై ఢిల్లీలో ఈరోజు ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో ఇందిరా గాంధీ గురించి ఎక్కడా చెప్పలేదు. ఆమె ఈ దేశం కోసం 32 తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. నిజాలకు భయపడే ఆమెను విస్మరించారు. వాస్తవానికి ఏ యుద్ధమైన 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ప్రపంచ అగ్రగామి అని చెప్పుకునే అమెరికా 20 ఏళ్ల పాటు అఫ్ఘానిస్తాన్‌తో యుద్ధం చేసింది. కానీ యావత్​ భారత్ ఒక్కటిగా నిలిచి.. 13 రోజుల్లోనే 1971 యుద్ధంలో పాకిస్తాన్​ను మట్టి కరిపించింది”అని రాహుల్ అన్నారు. ఇక, ఉత్తరాఖండ్​లోని చాలా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం సైతం దేశం కోసం త్యాగాలు చేసిందని, అదే ఈ రాష్ట్రంతో తనకు ఉన్న సంబంధం అని రాహుల్ అన్నారు.

మరోవైపు, విజ‌య్ దివ‌స్ వేడుక‌ల్లో ఇందిరా గాంధీ పేరును ప్ర‌స్తావించ‌కపోవ‌డం ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ కూడా కేంద్రంపై విమ‌ర్శించారు. 50 ఏళ్ల కింద‌ట ఇదే రోజున ఇందిరాగాంధీ నాయ‌కత్వంలో భార‌త్ బంగ్లాదేశ్‌కు విముక్తి క‌ల్పించింద‌ని,బీజేపీ ప్ర‌భుత్వం విజ‌య్ దివ‌స్ వేడుక‌ల్లో మ‌న తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరా గాంధీ ప్ర‌స్తావ‌న‌ను తీసుకురాలేద‌ని ప్రియాంక గాంధీ అన్నారు. ప్ర‌ధాని మోదీ మ‌హిళ‌లు చేసిన సేవ‌ల‌ను గుర్తించి గౌర‌వించ‌డం ప్రారంభించాల‌ని ప్రియాంక గాంధీ అన్నారు.

కాగా, బంగ్లా విముక్తి దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మాజీ ప్రధాని ఇందిగా గాంధీని గుర్తు చేసుకున్నారు. ఈ విషయమై బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇందిరా గాంధీ ఆమె గొప్పతనాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె ధైర్యసాహసాలు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచాయి. అనేక విధాలుగా 1971 ఏడాది ఇందిరాకు ఎంతో ప్రత్యేకం. ఆమె బంగ్లా ప్రజల కోసం మొత్తం ప్రపంచ సమాజాన్ని చైతన్యపరిచారు’’ అని తెలిపారు.

ALSO READ Natural Farming : ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలన్న మోదీ