Natural Farming : ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలన్న మోదీ

వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని రైతులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు.

Natural Farming :  ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలన్న మోదీ

Modi (3)

Natural Farming : వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని రైతులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలని మోదీ సూచించారు.

గుజరాత్‌లోని ఆనంద్‌ పట్టణంలో నిర్వహించిన ఆగ్రో అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో రైతులనుద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ..మెరుగైన వ్యవసాయోత్పత్తులను సాధించేందుకు, నేల తల్లి జీవిత కాలాన్ని పెంచేందుకు ప్రకృతి సహజ సాగు విధానాలను అవలంబించాలని సూచించారు. వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తీసుకొచ్చి.. ప్రకృతికిగల సొంత ప్రయోగశాలతో అనుసంధానం చేయాలని తెలిపారు. ప్రకృతి ప్రయోగశాల పూర్తిగా సైన్స్ ఆధారితమైందని, విత్తనాల నుంచి నేల వరకు అన్ని సమస్యలను సహజంగా పరిష్కరించవచ్చన్నారు.

ఎరువులకు ఎలాంటి శక్తి ఉందో, దానిని ప్రకృతి నుంచి కూడా పొందవచ్చునని చెప్పారు. మనం దానిని తెలుసుకోవాలని చెప్పారు. ప్రకృతి సహజమైన సాగు విధానంలో ఎరువులు, పురుగు మందుల కోసం ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని చెప్పారు. ఈ విధానంలో సాగునీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. వరదలు, కరువుకాటకాలు వంటి విపత్తులను కూడా ఎదుర్కొనే సత్తా లభిస్తుందని చెప్పారు. భారతీయ రైతులు స్వయం సమృద్ధమయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు.

గత కొన్ని సంవత్సరాల్లో రైతులు ప్రకృతి సహజ సాగు విధానాలను అవలంబించడం వల్ల వ్యవసాయోత్పత్తులు ఏ విధంగా పెరిగాయో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చెప్పారని మోదీ తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ఆధారం సైన్సేనని చెప్పారు. ప్రపంచం సాంకేతికంగా ప్రగతి సాధించినప్పటికీ, ఇది తన మూలాలకు కూడా అనుసంధానమైందన్నారు. దీనిని సాగు రంగంలో కూడా అమలు చేయాలని పిలుపునిచ్చారు.

రసాయన ఎరువుల వినియోగం రైతులకు ఆర్థికంగా భారం అవుతోందని, ఫలితంగా వారి ఆదాయానికి గండి పడుతోందని మోదీ తెలిపారు. విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవలసి వస్తోందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రకృతి సహజ సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయన్నారు.

ALSO READ Metroman Quits Politics : పాలిటిక్స్ కు మెట్రోమ్యాన్ గుడ్ బై