మదనపల్లి డబుల్ మర్డర్.. కోట్ల విలువైన ఆస్తుల కోసం కుట్ర జరిగిందా?

మదనపల్లి డబుల్ మర్డర్.. కోట్ల విలువైన ఆస్తుల కోసం కుట్ర జరిగిందా?

conspiracy behind madanpalle double murder case: చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. కన్నకూతుళ్లను తల్లిదండ్రులు ఎందుకు అతి కిరాతకంగా చంపారు అనేది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల మూఢభక్తే ఈ దారుణానికి కారణం అనే వాదనలు వినిపిస్తున్నా.. ఇంకా ఏదో జరిగిందనే అనుమానాలు లేకపోలేదు. పురుషోత్తం, పద్మజ దంపతుల పేరుతో ఉన్న కోట్ల విలువ చేసే ఆస్తుల కోసం కుట్ర జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జంట హత్యల మిస్టరీ రోజులో కొత్త కోణానికి దారితీస్తోంది. ఇప్పటి వరకు అలేఖ్య, సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంశాలను కేంద్రంగా చేసుకుని కొత్త కోణాలు, విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కొత్త కోణంలో ఈ హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు తలెత్తున్నాయి.

పురుష్తోతం, పద్మజ దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు హైకోర్టు న్యాయవాది రజని పురుషోత్తమ నాయుడును కలిసి మాట్లాడారు. జంట హత్యల నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తంను జైలులో కలిశారు.

ఈ హత్యలకు ప్రేరేపించింది మాత్రం వేరే వ్యక్తులు కచ్చితంగా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కుటుంబానికి చిత్తూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో పురుషోత్తం దంపతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. వారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన డాక్టర్లు ఆ ఇద్దరికి కస్టోడియన్‌ కేర్‌ కావాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్‌ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా డాక్టర్లు తెలిపారు.

కాగా, జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం, పద్మజ దంపతులను బుధవారం(ఫిబ్రవరి 3,2021) ఉదయం మదనపల్లి సబ్ జైలు నుంచి విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు పోలీసులు తరలించారు. మదనపల్లె సబ్ జైలులో పద్మజ మానసిక స్థితి చాలా విచిత్రంగా ఉన్నింది. పగలు నిశ్శబ్దంగానే ఉండే పద్మజ…రాత్రి అయ్యేసరికి రెచ్చిపోయేది. శివ..శివ అంటూ గట్టిగా అరుపులు, కేకలు వేసేంది. ఆమె తీరుతో తోటి ఖైదీలు భయాందోళన చెందారు. నిద్రలేని రాత్రులు గడిపారు. పద్మజ భర్త పురుషోత్తం మాత్రం సబ్ జైల్లో నిత్యం ఏడుస్తూ కనిపించారని పోలీసులు తెలిపారు.