Jahangirpuri violence : జహంగీర్‌పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్‌లో కోర్టుకు నిందితుడు..

వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు..

Jahangirpuri violence : జహంగీర్‌పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్‌లో కోర్టుకు నిందితుడు..

Jahangirpuri Violence

Jahangirpuri violence : వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగనాని తెలిపారు. హింస వెనుక ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన జహంగీర్‌పురి నివాసి అన్సార్ (35) కూడా గతంలో రెండు దాడి కేసులలో ప్రమేయం ఉన్నట్లు కనుగొనబడిందని, పలు సెక్షన్ల కింద కొన్నిసార్లు అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు.

Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్

జహంగీర్‌పురి హింసాకాండ కేసులో నిందితులను ఢిల్లీ పోలీసులు ఆదివారం రోహిణి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఓ నిందితుడు కోర్టులోకి ప్రవేశిస్తున్నప్పుడు ‘పుష్ప’ సినిమా స్టైల్ లో మెడకింద చేయిపెట్టుకొని తగ్గేదే లే అంటూ కెమెరాలవైపు ఫోజులివ్వడం కనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారింది. జహంగీర్ పురిలో హింసాకాండకు పాల్పడి కోర్టుకెళ్లే సమయంలో నిందితుడు ఇలా వ్యవహరించడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే హింసాకాండ ఘటనలో 8మంది పోలీసులు, ఒక పౌరుడుతో సహా 9 మంది గాయపడ్డారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన ఎండీ అస్లాం ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై తుపాకీతో కాల్చాడు. అతని వద్ద నుంచి అతడు ఉపయోగించిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని, గతంలో కూడా ఓ కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు తేలిందని డీసీపీ తెలిపారు. క్షతగాత్రులు బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుల్లెట్ గాయపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ పరిస్థితి నిలకడగా ఉందని డీసీపీ రంగాని తెలిపారు.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

ఇదిలాఉంటే ఈ ప్రాంతంలో మరోసారి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంది. జామియా నగర్, జసోలా ప్రాంతాలలో శాంతిభద్రతల నిమిత్తం ఢిల్లీ పోలీసులు డ్రోన్ కెమెరాలతో పాటు పెట్రోలింగ్ నిర్వహించారు. హింసాకాండ ఈ ఘటనపై తదుపరి విచారణకోసం కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఉద్రిక్తతలను చల్లబరచడానికి ఢిల్లీ పోలీసులు శాంతి కమిటీల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆదర్శ్ నగర్ బిజెపి కౌన్సిలర్ గరిమా గుప్తా హింసకు అక్రమ బంగ్లాదేశ్ వలసదారులే కారణమంటూ సమావేశంలో పలు అంశాలను లేవనెత్తారు.