Jet Airways : మళ్లీ గాల్లో ఎగరనున్న జెట్ ఎయిర్ వేస్

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ "జెట్‌ ఎయిర్‌వేస్‌" తిరిగి మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

Jet Airways : మళ్లీ గాల్లో ఎగరనున్న జెట్ ఎయిర్ వేస్

Jet Airways

Jet Airways  ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ “జెట్‌ ఎయిర్‌వేస్‌” తిరిగి మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరనున్నాయని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం  తెలిపింది.

కాగా,ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్ గా ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌..రుణ ఊబిలో కూరుకుపోయిన కారణంగా 2019 ఏప్రిల్‌లో  మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది.

ఈ కన్సార్షియం ఇటీవల రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఉద్యోగులకు జెట్‌ ఎయిర్‌వేస్ చెల్లించాల్సిన రూ.12,000 కోట్లను రానున్న ఐదేళ్లలో చెల్లిస్తామని రుణ పరిష్కార ప్రక్రియలో కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించింది.  జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT) ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

దీంతో జెట్‌ కార్యకలాపాల పునరుద్ధరణకు కన్సార్టియం చర్యలు వేగవంతం చేసింది. 2022 తొలి త్రైమాసికంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరనున్నాయని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం సోమవారం తెలిపింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

రాబోయే 3 సంవత్సరాలలో 50కి పైగా విమానాలు, 5 సంవత్సరాలలో 100కి పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు. రెండేళ్లకు పైగా మూతబడిన ఓ విమానయాన సంస్థ తిరిగి మళ్లీ కార్యకలాపాలు సాగించడం విమానయాన చరిత్రలో ఇదే తొలిసారి అని, ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని మురారి లాల్ జలాన్ తెలిపారు. ఇక జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0లో కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ముంబై నుంచి ఢిల్లీకి మార్చినట్లు తెలిపారు.

READ  Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం