రైతుల మేలు కోసం : చెప్పిన పంట వేసిన వారికే రైతు బంధు

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 02:38 AM IST
రైతుల మేలు కోసం : చెప్పిన పంట వేసిన వారికే రైతు బంధు

తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటల్నే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్‌కు తీసుకొస్తే ఎవరూ కొనబోరని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి విత్తనాల్ని మాత్రమే అమ్మాలని… ఇందుకోసం కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

రైతుల లాభం కోసం : –
తెలంగాణలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని సూచించారు. నియంత్రిత పద్ధతిలో ఈ వర్షాకాలంలోనే వరి పంట సాగు ప్రారంభించాలని చెప్పారు. పంట మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ 2020, మే 12వ తేదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 15వ తేదీన క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

సీడ్ రెగ్యులేటింగ్ అథార్టీ : –
తెలంగాణ కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున… ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే అమ్మాలి. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఖచ్చితమైన ఆదేశాలివ్వబోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

వ్యవసాయ శాఖ పునర్ వ్వవస్థీకరణ : –
సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయపర్చాలని కోరింది. రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 

మిల్లుల సామర్థ్యం పెంపు కోసం : –
తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది. ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్ధ్యం బాగా పెరగాల్సి ఉంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలేనే రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు.

నకిలీ విత్తనాల ఏరివేతకు : –
మరోవైపు రాష్ట్రంలో పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశముండటంతో నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పర్యటిస్తాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని వెంటనే గుర్తించి, పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం… వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

Read Here >> విద్యార్థులకు గమనిక : TS EAMCET పరీక్ష డేట్ ఫిక్స్!