Kishan Reddy : మంత్రి పదవుల్లో ప్రమోషన్ల కోసం ఏ రోజూ ఎవరినీ అడగలేదు.. ఏ శాఖ ఇచ్చినా ఓకే!

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిగా తన పనితీరుతో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించారు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ అయింది. దాంతో లోక్ సభకు ఎన్నికైన మొదటిసారే కేబినెట్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు కిషన్ రెడ్డి.

Kishan Reddy : మంత్రి పదవుల్లో ప్రమోషన్ల కోసం ఏ రోజూ ఎవరినీ అడగలేదు.. ఏ శాఖ ఇచ్చినా ఓకే!

Kishan Reddy

Kishan Reddy as Union Minister : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిగా తన పనితీరుతో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించారు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ అయింది. దాంతో లోక్ సభకు ఎన్నికైన మొదటిసారే కేబినెట్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు కిషన్ రెడ్డి. అలా సహాయమంత్రి నుంచి నేరుగా ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ చేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు కేబినెట్ పదవి ఇవ్వడం కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. మంత్రి పదవుల్లో ప్రమోషన్లు కావాలని తాను ఏ రోజు ఎవరినీ అడగలేదన్నారు. తనకు ఏ శాఖ ఇచ్చినా తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చేలా అంకితభావంతో పనిచేస్తానన్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి సరైన సహకారం అందేలా చూస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖ అభివృద్ధికి పనిచేస్తానని, తనకు ఓటేసినవారు తలదించుకునే పని ఎప్పుడూ చేయనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దులోనూ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. అనేక చట్టాల రూపకల్పనలో తన వంతు ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడు తర్వాత తనకే కేబినెట్ హోదాలోకి పదవి దక్కిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారంలో సమన్వయం చేస్తానన్నారు. హైదరాబాద్ నగరానికి మణిహారమైన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగంగా జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డుపై నితిన్ గడ్కరీతో ఇప్పటికే తాను చర్చించిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

అంకితభావంతో పనిచేస్తున్నవారిని మంత్రులుగా తీసుకోవడం జరిగిందని, తనకు ఇచ్చిన కేబినెట్ పదవిని మరింత బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి సమానంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తన జీవితంలో ఈ రెండేళ్లు మరిచిపోనివిని, అమిత్ షాకు సహాయకుడిగా పనిచేయడం మరిచిపోలేనిదిగా కిషన్ రెడ్డి చెప్పారు. 1980లో పార్టీ ఆఫీసులో పనిచేశానని, ఆ రోజు నుంచి పార్టీ గురించి ఆలోచించని రోజు లేదని గుర్తు చేసుకున్నారు. కేబినెట్ మినిస్టర్ అయిన ఈ రోజు మరిచిపోలేని రోజు అంటూ కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

తనపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తానని తెలిపారు.మరోవైపు.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.