Telangana: కేసీఆర్‌ని ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదని.. కానీ, ఇది తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కోరిక అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ వ్యూహంలో తాను పావును కాదలుచుకోలేదని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజీనామా చేస్తాన‌ని, కేసీఆర్ పతనం మునుగోడు తీర్పుతోనే మొదలవుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీ మారే స్వేచ్ఛ త‌న‌కు ఉంద‌ని కూడా అన్నారు.

Telangana: కేసీఆర్‌ని ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Rajagopalreddy

Telangana: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదని.. కానీ, ఇది తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కోరిక అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ వ్యూహంలో తాను పావును కాదలుచుకోలేదని స్పష్టం చేశారు. రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారుతున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న వేళ ఇవాళ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసి అనేక అంశాలు మాట్లాడానని, త‌మ‌ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని చెప్పారు. తాము కలలు కన్న తెలంగాణ ఎలా అయిపోయిందనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామ‌ని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎలా వచ్చిందో అమిత్ షాతో చర్చించాన‌ని చెప్పారు.

కేసీఆర్ తన అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. అమిత్ షాతో రాజకీయాలు, రాజీనామా గూర్చి మాట్లాడలేదని అన్నారు. ఉప ఎన్నిక వస్తుందని కేసీఆర్ కులాల వారీగా, మతాల వారీగా నాయకుల గూర్చి తెలుసుకుంటున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోయిన ప్రతిష్ఠ‌ మునుగోడు ఉప ఎన్నికల ద్వారా తిరిగి తెచ్చుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఆయ‌న అన్నారు. త‌న‌పై జరుగుతున్న దుష్ప్రచారం కేసీఆర్ ఆడుతున్న నాటకమేన‌ని ఆరోపించారు. తాను అమిత్ షాను కలిసినప్పటి నుంచి కేసీఆర్‌కి నిద్ర పట్టడం లేదని అన్నారు. గట్టుపల్లి మండలం ఏర్పాటు చేసినందుకు ప్రజల తరఫున కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌ని చెప్పారు.

నియోజకవర్గ అభివృద్ధిపై ఎన్ని సార్లు విజ్ఞ‌ప్తులు చేసినా వినని కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే మాత్రం ఇక్క‌డ‌ గెలవాలని చూస్తున్నాడని అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు తప్పా మిగతా అన్ని ప్రాంతాల‌పై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మినహా మిగతా నియోజకవర్గాల పై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మండిప‌డ్డారు. మిగతా నియోజకవర్గాలు తెలంగాణలో లేవా అని ప్ర‌శ్నించారు. ఉప ఎన్నిక వస్తే నే అభివృద్ధి కి నిధులు ఇస్తారా అని నిల‌దీశారు. పూర్తి మెజారిటీ ఉన్నప్ప‌టికీ ప్రతిపక్ష శాసన సభ్యులను కొనాల్సిన అవసరం కేసీఆర్‌కి ఏముంద‌ని ఆయ‌న నిల‌దీశారు. కేసీఆర్ తొత్తులు, కాంగ్రెస్‌లో తానంటే గిట్టని వాళ్ళు త‌నపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆవేదన వ్యక్తం చేశాన‌ని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల గెలుపులో త‌న‌ పాత్ర ఉందని అన్నారు. అవమానాలు భరిస్తూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశాన‌ని తెలిపారు. కేసీఆర్‌ని ఎదురించడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని చెప్పారు. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన వారి కింద పనిచేయమంటే ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్నాన‌ని చెప్పారు. తాను పార్టీ మారాల్సి వస్తే త‌న‌ కార్యకర్తలకు చెప్పి నిర్ణయం తీసుకుంటాన‌ని అన్నారు. కేసీఆర్‌ని ఓడించడం బీజేపీతో సాధ్యమవుతుందని మాత్రమే చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే త‌న జీవిత లక్ష్యమ‌ని తెలిపారు. జైళ్ళ‌కు వెళ్ళి వచ్చిన వాళ్ళు త‌నకు నీతులు చెప్తే ఎలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయ‌న అన్నారు. కేసీఆర్ కొంతమంది బఫూన్ల‌ను మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నారని ఆయ‌న చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకుని విదేశాల్లో దాచుకున్న కోట్లాది రూపాయలు అంశం బయటపడుతుందని అన్నారు. కేసీఆర్ త‌న‌ను రెచ్చగొడుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జలని మభ్యపెట్టి మునుగోడులో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయ‌న అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ఓడిపోయిన ఎమ్మేల్యే, ఓ దరిద్రపు మంత్రి మునుగోడులో తిరుగుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌ కార్యకర్తలు కోరుకుంటేనే మునుగొడులో ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఉప ఎన్నిక జరిగితే కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజలకు మధ్యే జరుగుతుంద‌ని అన్నారు.

COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌ 
ప్రజలు కోరుకుంటే రాజీనామా చేస్తాన‌ని, కేసీఆర్ పతనం మునుగోడు తీర్పుతోనే మొదలవుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీ మారే స్వేచ్ఛ త‌న‌కు ఉంద‌ని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు స‌రిగ్గా ఒకటో తారీఖున ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు జీతాలు వస్తే అది వార్తలా మారింద‌ని చెప్పారు. ప్ర‌త్యేక‌ తెలంగాణకి పచ్చి వ్యతిరేకులు ఇప్పుడు మంత్రులయ్యారని అన్నారు. కేసీఆర్ భద్రాచలం రాముడ్ని కూడా మోసం చేశారని, ఆల‌యాన్ని పున‌ర్నిర్మించ‌లేద‌ని చెప్పారు. తెలంగాణలో అధికారులకు అధికారాలే లేవని అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. అవినీతిపై అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు అడ్డుకుంటున్నారని, లేదంటే మైక్ కట్ చేస్తారని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల్లారా ఖబడ్దార్ అని హెచ్చ‌రించారు.

ఈసారి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ది చెబుతార‌ని అన్నారు. ఉప ఎన్నిక వస్తే గెలవాలని ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ అనుకుంటోంద‌ని చెప్పారు. అవినీతి సొమ్ముతో ఇతర నాయకులను కొని గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రంగులు మార్చడం వంటి ప‌నులు తాను చేయనని చెప్పారు. త‌న‌కు కాంగ్రెస్ అంటే అభిమానమ‌ని, సోనియా గాంధీ అంటే గౌరవమ‌ని చెప్పారు. కాంగ్రెస్ అదిష్ఠానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మౌనంగా ఉన్నాన‌ని తెలిపారు. సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమ‌ని చెప్పారు. కేసీఆర్ ఓడించేందుకే తాను పార్టీ మారుతాన‌ని అన్నారు.

Delhi: మా పోస్ట‌ర్లు తొల‌గించి మోదీ పోస్ట‌ర్లను అంటించారు: ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్‌