కొండంత సంబరం : కొండ పోచమ్మ ప్రాజెక్టు..ఆ పేరు ఎలా వచ్చిందంటే ? 

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 12:57 AM IST
కొండంత సంబరం : కొండ పోచమ్మ ప్రాజెక్టు..ఆ పేరు ఎలా వచ్చిందంటే ? 

రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వంద మీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టం ఆవిష్కృతంకానుంది. భువి నుంచి అర కిలోమీటరుకు పైగా ఎత్తులోకి ఎగిరి దూకేందుకు సిద్ధమైంది. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లను నిండుకుండలా మారుస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణించిన కాళేశ్వరం జలాలు 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సిగలో కొలువుతీరనున్నాయి. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలోని కొండ పోచమ్మ తల్లి సిగలో పూవై మెరిసిపోవడానికి ఆత్రంగా వస్తోంది గోదారి తల్లి. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టులో శిఖరాయమానమైన ఘట్టం 2020, మే 29వ తేదీ శుక్రవారం ఆవిష్కృతమైంది. 

అత్యధిక ఎత్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండ పోచమ్మ దేవాలయం ఉంటుంది. దీని సమీపంలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం ఉంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్‌కు మల్లన్న సాగర్ అని.. అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్ కు కొండ పోచమ్మ సాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా, వరంగల్, నల్గొండ సరిహద్దుల్లో ఉన్న కొండపోచమ్మ ఆలయానికి ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా శుభ కార్యాలయాలకు ముందు పోచమ్మను దర్శించుకోవడం ఆచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు పలుసార్లు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ అమ్మవారికి మొక్కిన కేసీఆర్… ఆ తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు.  ఆలయానికి కొద్ది దూరంలోనే కొమురవల్లి మల్లన్న కొలువుదీరి ఉన్నారు. ఈ రెండు ఆలయాలను కాకతీయ రాజులు అభివృద్ధి చేసినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. ఎంతో సుప్రసిద్ధి చెందిన కొండపోచమ్మ ఆలయం పేరునే ఈ రిజర్వార్‌కు కెసిఆర్ నామకరణం చేశారు.

Read: కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం : సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్