కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం : సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 12:45 AM IST
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం : సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరబోతున్నాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకోబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. 

కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు : –
కొండపోచమ్మ ఆలయానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్‌… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూర్ణాహుతి అనంతరం ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9.35కి ఎర్రవల్లిలో.. 9.40కి మర్కుక్‌లోని రైతు వేదికలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం  9.50కి మర్కుక్ పంప్‌హౌస్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి… 10గంటలకు అక్కడికి హెలికాప్టర్‌లో చేరుకునే చిన్నజీయర్ స్వామిని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మర్కుక్‌ పంప్‌హౌజ్‌ వద్ద జరిగే సుదర్శనహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు పంప్‌ హౌస్‌ స్విచ్‌ ఆన్‌ చేసి రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు.

చిన జీయర్ స్వామితో కలిసి : –
పంప్‌హౌజ్‌ ప్రారంభోత్సవం తర్వాత చిన జీయర్‌ స్వామితో కలిసి కొండపోచమ్మ సాగర్‌ కట్ట మీద డెలివరీ సిస్టమ్‌ దగ్గరకు చేరుకోనున్న ముఖ్యమంత్రి… 11గంటల 35 నిమిషాలకు డెలివరీ సిస్టమ్‌ దగ్గర గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వరదరాజుపూర్‌ గ్రామంలోని వరద రాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్తారు. 12 గంటల 40నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి మర్కుక్‌ పంప్‌ హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమవుతారు. 

గట్టి బందోబస్తు : –
సీఎం పర్యటనకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లుచేశారు. మొత్తం బందోబస్తును 17 సెక్టార్లుగా విభజించారు. ముగ్గురు అడిషినల్‌ ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 48 మంది సీఐలు, 112 మంది ఎస్‌ఐలు, 158 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌లు, 702 మంది కానిస్టేబుళ్లు, 46 మంది మహిళా కానిస్టేబుళ్లు, డాగ్‌ స్కాడ్స్‌, సెక్యూరిటీ టీమ్‌, మప్టీ పార్టీ సహా మొత్తం 1,120 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Read:అపూర్వ ఘట్టం : కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం