TMC In Goa : గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్

ఏడాది ప్రారంభంలో జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీపై భారీ విజయం సాధించినప్పటి నుండి టీఎంసీ పార్టీ..దేశ రాజకీయలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది.

TMC In Goa : గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్

Tmc

TMC In Goa  ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీపై భారీ విజయం సాధించినప్పటి నుండి టీఎంసీ పార్టీ..దేశ రాజకీయలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. 2024 సాధారణ ఎన్నికలకు ముందే దేశంలోని ఇతర ప్రాంతాలలో తృణమూల్ ప్రభావాన్ని విస్తరించే ప్రణాళికల గురించి టీఎంసీ నేతలు ఇటీవల కాలంలో పదే పదే మాట్లాడుతున్న విషయం తెలిసిందే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీకి గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు దీదీ టీమ్ రంగంలోకి దిగుతోంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీజేపీ పాలిత త్రిపురలో ఇప్పటికే టీఎంసీ బలమైన జోరు కనిపిస్తోంది. తాజాగా గోవాపై టీఎంసీ కన్నుపడింది.

వ‌చ్చే ఏడాది గోవాలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఎంసీ పోటీకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే త్వ‌ర‌లో టీఎంసీ పార్టీ త‌మ ఎంపీల‌ను గోవాకు పంపాల‌న్న ప్లాన్‌లో ఉంది. ఆ రాష్ట్ర నేత‌ల‌తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిపింది టీఎంసీ. దీదీ మేన‌ల్లుడు, ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా త్వరలో గోవాలో పర్యటించే అవకాశముందని తెలుస్తోంది. గోవాలో కాంగ్రెస్ పార్టీ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని, టీఎంసీకి ఓటు వేస్తేనే, బీజేపీని దూరం చేయ‌వ‌చ్చు అన్న ఆలోచ‌న‌ల్లో గోవా ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు టీఎంసీ చెబుతోంది. మరోవైపు, ఇప్ప‌టికే టీఎంసీ కోసం గోవాలో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) నుండి 200 మంది బృందం పని చేస్తున్నట్లు సమాచారం. ఇక,ఢిల్లీ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవా ఎన్నికలపై దృష్టి పెట్టింది.

మరోవైపు, వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయబోతుందంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ బుధవారం స్పందిస్తూ.. పోటీదారుల సంఖ్య పెరుగుదల పాలక బీజేపీని కలవరపెట్టదని అన్నారు. అందరూ గోవాకి రండి..గోవాని అందరూ ఇష్టపడతారు అని సావంత్ అన్నారు. అంతకుముందు, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని గోవా రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు సావంత్. కేజ్రీవాల్ తనపై పోటీ చేయాలనుకున్నా, తాను స్వాగతిస్తానని సావంత్ అన్నారు.

కాగా,గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. త్రిపుర కంటే చిన్న రాష్ట్రం గోవా. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ 17 సీట్లు మరియు భారతీయ జనతా పార్టీ 13 సీట్లు గెలుచుకున్నాయి. అయినప్పటికీ, బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.