Imran Khan: మగాళ్లు రోబోలు కాదు.. ఆడవారి దుస్తులపై పాక్ ప్రధాని!

ఆడవారి దుస్తులపై ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో దుమారం రేగుతుంది. అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలలో ఆడవారి దుస్తులపై పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు లేవు కానీ.. అప్పుడప్పుడు మిగతా దేశాలలో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది.

Imran Khan: మగాళ్లు రోబోలు కాదు.. ఆడవారి దుస్తులపై పాక్ ప్రధాని!

Imran Khan

Imran Khan: ఆడవారి దుస్తులపై ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో దుమారం రేగుతుంది. అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలలో ఆడవారి దుస్తులపై పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు లేవు కానీ.. అప్పుడప్పుడు మిగతా దేశాలలో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే మన దేశంలో అత్యాచారాలకు ఆడవారి దుస్తులు కూడా ఒక కారణమేనని వ్యాఖ్యలు చేయగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. కాగా, ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతకుమించిన ఘాటు వ్యాఖ్యలు చేసి మరో దుమారం రేపారు.

ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో లైంగిక వేధింపుల కేసుల పెరుగుదలకు మహిళల దుస్తులు, వస్త్రధారణే కారణమని పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే, ఆ ప్రభావం పురుషులపై పడుతుందని.. చూస్తూ ఉండేందుకు మగవాళ్లు రోబోలు కాదు కదా.. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్, దక్షిణ ఆసియా న్యాయ సలహాదారు రీమా ఒమర్ అత్యాచారాలకు, వస్త్రధారణకు ముడిపెట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. కాగా.. ఇమ్రాన్ వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన డిజిటల్ మీడియా విభాగం ప్రతినిధి డాక్టర్ అర్స్లాన్ ఖలీద్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా దీనిపై అప్పటికే దుమారం మొదలైపోయింది.