Minister KTR: సీసీఐని తిరిగి తెరవాలంటూ కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ

ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Minister KTR: సీసీఐని తిరిగి తెరవాలంటూ కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ

Ktr

Minister KTR: ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలంటూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 1998 నుంచి ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ లో ఉత్పత్తి నిలిపివేశారు. ప్రస్తుతం ఇక్కడి సిమెంట్ యూనిట్ ను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు కేటీఆర్ తన లేఖలో వివరించారు. పరిశ్రమ అధీనంలో 772 ఎకరాల భూమి ఉందని దానికి తోడు.. 170 ఎకరాల్లో టౌన్షిప్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదేకాక పరిశ్రమ కింద లీజుగా ఉన్న 1500 ఎకరాల భూమిలో 48 మిలియన్ టన్నుల సున్నపురాయి, నీరు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. పరిశ్రమకే సరిపోయే విధంగా ప్రత్యేక 2KVA విద్యుత్ సరఫరా యధాతధంగా ఉన్నట్లు కేటీఆర్ గుర్తు చేసారు.

Also Read: Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్, భక్తుల అవస్థలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంబిస్తే.. చుట్టుప్రక్కల అభివృద్ధికి దోహదపడుతుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమ తిరిగి తెరుచుకుంటే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. భౌగోళికంగా ఆదిలాబాద్ ఉన్న ప్రాంతాన్ని భట్టి.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకునేందుకు రవాణా సదుపాయాలు మెండుగా ఉంటాయని కేటీఆర్ తెలిపారు.

రానున్న రోజుల్లో తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సిమెంట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పిన కేటీఆర్.. అందుకు ఉదాహరణగా ఓరియంట్ సిమెంట్ సంస్థ దేవపూర్ ప్లాంట్ లో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ తెరవాలంటూ గతంలోనూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన కరువైందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీసీఐ ప్లాంట్ ను తిరిగి ప్రారంభిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

Also Read: Crime News: కోవిడ్ టీకా అంటూ వ్యక్తిని తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన వైనం