Omicron Surge : న్యూ ఇయర్ వేడుకలపై ఏయే రాష్ట్రాలు నిషేధం విధించాయంటే?

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Omicron Surge : న్యూ ఇయర్ వేడుకలపై ఏయే రాష్ట్రాలు నిషేధం విధించాయంటే?

New Year Celebrations Banned In These States Amid Omicron Surge. Check List Here

Omicron Surge : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నూతన సంవత్సర (New Year celebrations) వేడుకలపై ఆంక్షలు విధించాయి. Omicron తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ విదేశీ ప్రయాణీకుల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించాయి. మెట్రో నగరాలతో పాటు ప్రధాన, అంతర్జాతీయ మెట్రో నగరాల్లో వైరస్ మ్యుటేషన్ ఎక్కువగా నమోదవుతోంది.

వైరస్ వ్యాప్తితో అనేక ప్రాంతాల్లో సమావేశాలను నిషేధించాయి. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించాయి. Omicron వేరియంట్‌గా ఆందోళనకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. ఈ వేరియంట్ ముప్పై ఏడుకుపైగా మ్యుటేషన్లను కలిగి ఉందట.. పూర్తి రెండు డోసుల టీకాలు తీసుకున్న వ్యక్తులపై కూడా ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేరియంట్ ట్రాన్స్మిసిబిలిటీ అధిక సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా డెల్టా వేరియంట్ కన్నా అతివేగంగా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య నెల వ్యవధిలో 800కి చేరుకుంది. దేశంలో నూతన సంవత్సర వేడుకలపై ఏయే రాష్ట్రాల్లో నిషేధం విధించాయంటే.. ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ :
దేశ రాజధాని ఢిల్లీ 2022 న్యూ ఇయర్ వేడుకలకు ముందే అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షలను విధించారు. నగరంలో 0.5శాతం పాజిటివిటి రేటు నమోదు కావడంతో ఢిల్లీ ‘ఎల్లో అలర్ట్’ను ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అలాగే రెస్టారెంట్లు, బార్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లు 50శాతం సీటింగ్ కెపాసిటీతో నిర్వహించాలని DDMA అధికారులు ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలపై నిషేధం విధించారు.

మహారాష్ట్ర :
మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్ వణికిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమికూడడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశంలో కొత్త సంవత్సర వేడుకలను బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో 5 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి ఉండదు. రెస్టారెంట్లు, జిమ్‌లు, సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతోనే నడుపుకోవాలని BMC ఆదేశాలు జారీ చేసింది.

తమిళనాడు :
తమిళనాడులోనూ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ కొత్త ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని మెరీనా బీచ్, ఇలియట్స్ బీచ్, నీలంకరై కోస్ట్ రోడ్‌లో బహిరంగ సమావేశాలను నిషేధించింది. ఆర్‌కె సలై, రాజాజీ సలై, కామరాజర్ సలై, అన్నాసాలై, జిఎస్‌టి రోడ్, ఇతర ఆర్టీరియల్ రోడ్లలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. మెరీనా బీచ్, వార్ మెమోరియల్ నుంచిగాంధీ విగ్రహం, కామరాజ్ రోడ్ బెసెంట్ నగర్ ఇలియట్స్ బీచ్ రోడ్ వరకు రాత్రి 9 గంటల నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లు, క్లబ్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు DJ పార్టీలతో సహా ఎలాంటి కమర్షియల్ ప్రొగ్రామ్స్ నిర్వహించకూడదని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటక :
కర్ణాటకలోనూ ఒమిక్రాన్ వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 7 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొత్తంగా 10 రోజుల పాటు కర్ణాటక ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా పబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలను ప్రభుత్వం నిషేధం విధించింది. బయటి ప్రాంగణంలో న్యూ ఇయర్ పార్టీలు ఫంక్షన్లు, ముఖ్యంగా DJలతో జరుపుకునే ప్రొగ్రామ్‌లపై నిషేధం విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు 50శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 28 నుంచి వివాహాలు సహా సమావేశాలు, సమావేశాలు పాల్గొనే వారి సంఖ్యను 300 మందికి పరిమితం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

గోవా :
గోవా రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఆంక్షలు విధించారు. గోవాలో పార్టీలకు హాజరు కావడానికి లేదా రెస్టారెంట్లలోకి ప్రవేశించడానికి పూర్తి టీకా లేదా కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టును తప్పనిసరి చేశారు. అయితే, రాష్ట్రంలో ఎలాంటి రాత్రి కర్ఫ్యూను విధించలేదు. పర్యాటక సీజన్‌ కావడంతో రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది.

కేరళ :
రాత్రి వేళల్లో నూతన సంవత్సర వేడుకలను కేరళ నిషేధించింది. పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు 60శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేయవచ్చు.

గుజరాత్ :
గుజరాత్ ప్రభుత్వం మొత్తం 8 నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూను మరో 2 గంటలు పొడిగించింది. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, జామ్‌నగర్, భావ్‌నగర్, గాంధీనగర్‌లలో కర్ఫ్యూ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది.

ఒడిషా :
2022 జనవరి, 2 వరకు కొత్త సంవత్సర వేడుకలపై అదనపు ఆంక్షలు విధించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, సమావేశ మందిరాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రిపూట నిర్వహించే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

Read Also : PM Modi UAE Tour : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ యూఏఈ పర్యటన రద్దు