Swayam Prabha: ఫీజు లేకుండా.. అరచేతిలో ఐఐటీ పాఠాలు!

కాలేజీల్లో సౌకర్యాలు లేకపోవడం.. సౌకర్యాలున్న కాలేజీలలో చదివేందుకు చోటు దక్కకపోవడం.. ఉన్న కాలేజీలలో సరైన ఫ్యాకల్టీ కొరత.. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్న చోట చదివేంత స్థోమత సరిపోక ఎందరో తెలివైన విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ పరిష్కారాలు చూపిస్తోంది.

Swayam Prabha: ఫీజు లేకుండా.. అరచేతిలో ఐఐటీ పాఠాలు!

Swayam Prabha

Swayam Prabha: కాలేజీల్లో సౌకర్యాలు లేకపోవడం.. సౌకర్యాలున్న కాలేజీలలో చదివేందుకు చోటు దక్కకపోవడం.. ఉన్న కాలేజీలలో సరైన ఫ్యాకల్టీ కొరత.. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్న చోట చదివేంత స్థోమత సరిపోక ఎందరో తెలివైన విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ పరిష్కారాలు చూపిస్తోంది. ఇంటర్నెట్ వేదికగా కాజీపేట కుర్రోడు ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ పాఠాలు వింటున్నారు.. అమలాపురం అమ్మాయి ఆస్ట్రోఫిజిక్స్‌లో అత్యున్నత స్థాయి లెక్చర్స్‌ వింటుంది.

ప్రపంచం నలుమూలల నుండి గొప్ప గొప్ప అధ్యాపకుల పాఠాలు వినేలా కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు పోర్టళ్లు, ఛానల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటిద్వారా ఆన్‌లైన్‌లోనే అకడమిక్‌, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు.. ఇంటర్నెట్ లోనే వర్చువల్‌ ల్యాబ్స్‌లో ప్రయోగాలూ చేసుకోవచ్చు. సరైన కోచింగ్‌ లేకనే మేము ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందలేకపోయామని ఏ విద్యార్థి భావించరాదనేదే లక్ష్యంగా.. పేద విద్యార్థి కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తామని ఐఐటీలు చెబుతున్నాయి.

ఇందుకోసం జేఈఈకి ప్రైవేటు సంస్థల్లో ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా ‘స్వయంప్రభ’ పోర్టల్‌ ద్వారా ప్రసారమయ్యే వీడియోలు చూస్తే సరిపోయేలా పాఠాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండగా ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ 34 డీటీహెచ్‌ ఛానెళ్లను స్వయంప్రభ ఛానెల్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ డీటీహెచ్ ఛానెళ్లలో ఐఐటీ పాల్‌కు నాలుగు ఛానళ్లు కేటాయించగా.. జేఈఈకి మూడు, నీట్‌కు ఒక దాన్ని తీసుకొచ్చారు. ఎయిర్‌టెల్‌, టాటా స్కై, జియో డిష్‌ వినియోగదారులు కూడా వాటిని ఉచితంగా పొందే వీలుంది.

ఇందులో ప్రతిరోజూ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి నాలుగు గంటల నుంచి ఆరు గంటలపాటు పాఠాలు ప్రసారం అవుతాయి. మళ్లీ వాటినే రోజంతా ప్రసారం చేస్తారు కనుక విద్యార్థులు వారికి ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినన్ని సార్లు వాటిని చూసుకోవచ్చు. ఇక గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి స్వయంప్రభ అనే యాప్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు నాలుగు సబ్జెక్టులకు సంబంధించి 200 పాఠాలను రూపొందించి ప్రసారం చేస్తుండగా వాటిని భారీగా పెంచుతామని చెప్తున్నారు.

వీడియో పాఠాలతోపాటు మెటీరియల్‌, లైవ్‌లో సమాధానాలు, నమూనా ప్రశ్నపత్రాలు ఇలా ప్రతిదీ అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఐఐటీలో చేరేందుకు ఇక లక్షలు అవసరం లేదు.. ఏ కోచింగ్ సెంటరుకు వెళ్ళక్కర్లేదు.. మీలో సంకల్పం ఉంటే చాలు.. గెట్ రెడీ!