Neeraj Chaudhary : కరోనాను జయించి..ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించి..

కరోనా నుంచి కోలుకుని ఎవరెస్ట్ శిఖరంపై భారత మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించి రాజస్థాన్ అధికారి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Neeraj Chaudhary : కరోనాను జయించి..ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించి..

Rajasthan Man Mount Evarest (1)

సంకల్పం బలం ఉంటే సకల సముద్రాలను ఈది లక్ష్యాన్ని చేరుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు.సంకల్పంతో పాటు కృషి పట్టుదల ఉంటే కరోనా వైరస్ ని జయించటమే కాదు ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వాతాన్ని కూడా అధిరోహించ వచ్చని నిరూపించాడో వ్యక్తి. అతనే రాజస్థాన్ కు చెందిన నీరజ్ చౌదరి. కరోనా సోకి కోలుకున్న 7 వారాల్లోపే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించటానికి బయలుదేరి ఆ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఎవరెస్ట్ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించారు నీరజ్ చౌదరి.

2020లో భారత పర్వతారోహకుల సమాఖ్య(ఐఎంఎఫ్​)లో సభ్యుడిగా ఎంపికయ్యారు. కానీ కరోనా కరాళ నృత్యం చేస్తున్న క్రమంలో 2020లో చేయాల్సిన ఎవరెస్టు యాత్ర వాయిదా పడింది. కానీ మరోసారి 2021లో ఎవరెస్టు అధిరోహించేందుకు నేపాల్​ ప్రభుత్వం మళ్లీ అనుమతులు ఇచ్చింది. దీంతో రోండో సారి యాత్రకు బయలుదేరారు నీరజ్. కరోనా సెకండ్ వేవ్ మొదలు కాని సమయంలో నేపాల్​లోని ఖాట్మండుకు చేరుకున్నారు నీరజ్​. అక్కడి బేస్​ క్యాంపులో కరోనా నిబంధనల్లో భాగంగా నీరజ్ కు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో యాత్రకు మరోసారి బ్రేకులు పడ్డాయి. దీంతో చేసేదేమీ లేక నీజర్ తిరిగి జైపుర్​కు వచ్చేశారు.

మార్చి 27న కరోనా బారిన పడ్డ నీరజ్​..మానసికంగా కాస్త కలవరపడ్డారు. కానీ ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పంతో త్వరగానే కోలుకున్నారు. తిరిగి ఏప్రిల్​లో ఖాట్మండుకు చేరుకున్నారు. మే 31న అతడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు అధిరోహించేదుకు ఖాట్మండులోని బేస్​ క్యాంపుకు చేరుకున్నాక భారత్​లో కరోనా వ్యాప్తి, దాంతో పాటు ఏర్పడ్డ తుపాను పరిస్థితులు తనను కలవరానికి గురిచేశాయని చెప్పాడతడు.

దీనిపై నీరజ్ మాట్లాడుతూ..కోవిడ్ సోకినా నాకు శ్వాస సమస్య పెద్దగా రాలేదు. ఇతర లక్షణాలు కూడా ఏమీలేవు. ఆ సమయంలో నా ధ్యాస అంతా ఎవరెస్టు ఎక్కాలనే..దీనికి ఎలా ప్రిపేర్ కావాలనే. ఈసారి నేను ఎవరెస్టును అధిరోహించకపోతే.. మళ్లీ నాకంటూ రెండో అవకాశం లేదు’ దీంతో నేను నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కష్టం వచ్చిందని కూర్చుంటే అడుగు ముందుకు పడదు. దీంతో నన్ను నేనే స్ఫూర్తి పొందేలా చేసుకున్నాను. ఫలితంగా నేను నా లక్ష్యాన్ని సాధించగలిగాను అని నీరజ్​ చౌదరి తెలిపారు.

పర్వతారోహణ చేయటమంటే కేవలం శారీరకంగా బలంగా ఉంటేనే సరిపోదు..మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. నేను 36 గంటల్లో మూడు సార్లు ప్రయత్నించి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోగలిగాను. మే 31న నేను ఎవరెస్టును అధిరోహించడం నాకు మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని నీరజ్​ చౌదరి తెలిపారు.పర్వతారోహణలో తనకు మార్గనిర్దేశనం చేసిన ఢిల్లీ ఐఐటీ నీరజ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నీరజ్ యాత్ర కోసం ఐఐటీ ఢిల్లీ రూ.24 లక్షలను సేకరించి అందజేసింది. అందుకే.. ఎవరెస్టును అధిరోహించిన తర్వాత అతడు జాతీయ పతాకంతో పాటు తన కళాశాల పతాకాన్ని కూడా ఎవరెస్ట్ శిఖరంపై ​ఎగురవేశారు.