Delhi Weekend Curfew : ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ.. సమయాలివే..!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్, ఓమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను విధించింది.

Delhi Weekend Curfew : ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ.. సమయాలివే..!

Omicron Threat, Weekend Curfew, Delhi Govt, Omicron Cases, Arvind Kejriwal

Delhi Weekend Curfew: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను ప్రకటించింది. రాష్ట్రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఉదయమే సీఎం కేజ్రీవాల్ తనకు కరోనా సోకినట్టు ట్వీట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరకముందే ఢిల్లీ ప్రభుత్వం వారంతపు కర్ఫ్యూ దిశగా నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులందరూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానంలో పనిచేయాల్సి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అత్యవసర సేవలు మినహా ఈ సమయాల్లో ఇతరులను రోడ్లపై అనుమతించబోమని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. వీకెండ్ లో అకారణంగా ఎవరూ బయటకు రావొద్దని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సూచించారు. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఎక్కువైతే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రజా రవాణాపై ఆంక్షల్లో మార్పులు చేసింది. పూర్తి సామర్థ్యంతో బస్సులు, మెట్రోలు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. అత్యవసర రోజువారీ సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం, ప్రైవేటు కార్యాలయాల్లో 50శాతం సామర్థ్యంతో ఉద్యోగులు హాజరు కావాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో 350 మంది ఉంటే.. కేవలం 120 మంది బాధితులకు మాత్రమే ఆక్సిజన్ అవసరం ఏర్పడిందన్నారు. ఏడుగురు మాత్రమే వెంటలేటర్‌పై ఉన్నారని, కోవిడ్ గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. హోం ఐసోలేషన్ లో ఉండి కోవిడ్ నయం చేసుకోవచ్చునని డిప్యూటీ సీఎం మనీష్
సిసోడియా తెలిపారు.

ప్రస్తుతం.. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రెండోస్ధానంలో ఉంది. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో నమోదయ్యే ప్రతీ నాలుగైదు కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసు ఒకటి ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం వెంటనే ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. పగటి పూట ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీకెండ్ కర్ఫ్యూ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఢిల్లీ పూర్తి లాక్ డౌన్ లోకి వెళ్లే పరిస్థితి లేకపోలేదు.

Read Also : CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా